పిఎంఓ వెల వెల
న్యూఢిల్లీ:పార్లమెంటులోను, సౌత్ బ్లాక్ లోను ప్రధాన మంత్రి మన్ మోహన్ సింగ్ లోని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.ఇటీవలే బైపాస్ సర్జరీ చేయించుకున్న ప్రధాని ప్రస్తుతం ఇంట్లో కోలుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే లోక్ సభ ఎన్నికలు కేవలం రోండు నెలల వ్యవధిలో జరుగనున్న తరుణంలో, కొన్ని అత్యవసరంమైన సమయాల్లో మన్ మోహన్ సింగ్ లేకపోవడంతో,విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆయన విధులు కొన్ని నిర్వర్తిస్తుండగా, హోం మంత్రి పి.చిదంబరం, రక్షణ మంత్రి ఎ.కె.ఆంథోని తమ బాధ్యతలను, ఎటువంటి ఫిర్యాదులకు తావులేకుండా, నెరవేరుస్తున్నారు. ప్రధాన మంత్రి తన కార్యాలయానికి వచ్చేంతగా కోలుకోనందు వల్ల కొన్ని అతి ముఖ్యమైన నిర్ణయాలను పెండింగులో వుంచారు. అయితే ప్రణబ్ ముఖర్జీ సోమవారం లోక్ సభలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ పై సంతకం చేయడం వంటి, తాను చేయగలిగిన పనులు చాలా వరకూ మన్ మోహన్ ఇంటి వద్దనే పూర్తి చేస్తున్నారు.
ప్రధాని ఆరోగ్యం గురించి ఏమాత్రం ఆందోళన చెందనవసరం లేదని, ఆపరేషన్ తరువాత, కాంగ్రెస్ నాయకులు ఆశించినంత త్వరగా, ఆయన కోలుకోలేకపోయారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాకపోతే, మితాహారపు అలవాట్లు ఆయన త్వరగా కోలుకోడానికి అవరోధం అవుతున్నాయని, సాధారణంగా ఇటువంటి విషయాలు బయటకు పొక్కనివ్వని ప్రధాని నివాసం సిబ్బంది, వెల్లడించారు. వారు కోరుకున్నంత బలవర్ధకమైన ఆహారాన్ని మన్ మోహన్ సింగ్ తినడం లేదట.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రధాన మంత్రి తన కార్యాలయంలో లేకపోవడంతో జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు ఎం.కె.నారాయణన్ కు అంతగా పని లేకుండాపోయింది. చిదంబరం హోం మంత్రిత్వ శాఖ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి, అటు విదేశ విధానం, ఇటు ఆంతరంగిక భద్రతల విషయంలో అత్యంత కీలకమైన నారాయణన్ పాత్ర అనేక ఊహాగానాలకు తావిస్తోంది. అంతేకాకుండా, ఎన్నికలకు ముందే విదేశ పర్యటనలకు వెళ్లాలనుకుంటున్న మంత్రులు చాలామంది ప్రధాని అనుమతికోసం ఎదురు చూస్తుండగా, ప్రస్తుతానికి ఆ నిర్ణయాలను పెండింగులో పెట్టేశారు. ఈ తాత్కాలిక ఏర్పాట్లు బాగానే వున్నా, కొన్ని రాజకీయపరమైన అత్యవసర నిర్ణయాలు ఎవరు తీసుకుంటారన్నది ఎవరూ ఇతమిత్థంగా చెప్పలేకపోతున్నారు. ఉదాహరణకు, హోం మంత్రి అమెరికా పర్యటనకు విదేశాంగ మంత్రి అనుమతి ఇవ్వవచ్చునో లేదో ఎవరికీ తెలియదు.
అదేవిధంగా కాశ్మీర్ వ్యవహారాలకు సంబంధించి కూడా మన్ మోహన్ సింగ్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. వేసవికాలం ప్రారంభమై తీవ్రవాదుల కదలికలకు పరిస్థితులు అనుకూలించే లోగా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో చర్చలకు ఆహ్వానంకోసం వేర్పాటువాద నాయకులు కొందరు ఎదురుచూస్తన్నారు. అయితే ప్రధాని మన్ మోహన్ సింగ్ పర్యవేక్షణ లేకుంటే అటువంటి చర్చలు అర్ధవంతం కావు.
ఇక రాజకీయ వ్యవహారాల విషయానికొస్తే, మంత్రులు ఇప్పటికే తలకుముంచిన భారంతో పనిచేస్తున్నారు. ఎన్నికల్లోగా మంత్రివర్గంలో మరొక్కసారి మార్పులు జరగకపోతాయా అని గులాం నబీ అజాద్ తదితర మంత్రి పదవులు ఆశిస్తున్నవారు ఆశగా ఎదుకుచూస్తున్నారు. మన్ మోహన్ సింగ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో వున్న సమాచార, ప్రసార శాఖ, బొగ్గు, పర్యావరణ, అటవీ శాఖలలో పనులు కేబినెట్ హోదా మంత్రులు లేక దాదాపుగా స్తంభించిపోయాయి. విదేశ వ్యవహారాల శాఖ సహాయమంత్రి ఆనంద్ శర్మ, అదనంగా, ప్రధాని కార్యాలయంనుంచి సమాచార, ప్రసార శాఖ వ్యవహారాలు నడిపిస్తున్నారు. అలాగే పృథ్వీరాజ్ చవాన్ సిబ్బంది వ్యవహారాలతోపాటు ప్రధాని అదీనంలోని అనేక మంత్రిత్వశాఖలను పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ఈ నెల 26న ముగిసేలోగా తన కార్యాలయంలో అడుగుపెడతారని కొందరు యు.పి.ఎ నాయకులు ఆశించారు. అయితే ఆయన కనీసం మార్చి రెండోవారం వరకూ విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు స్పష్టంగా చెబుతున్నారు.
News Posted: 15 February, 2009
|