అమ్మకానికి పెళ్లికూతుళ్లు
ఖాట్మండు: నీతి నియమాలు లేని పెళ్లిళ్ల బ్యూరోల పని ఇప్పుడు నేపాల్ లో మూడు పువ్వులు ఆరు కాయలుగా వుంది.ఒడ్డూ పొడుగూ వున్న కొరియన్ అబ్బాయిలతో పెళ్లి జరిపిస్తామని అమ్మాయిలను ఆకర్షించి వారి కొంప ముంచుతున్నాయి. పెళ్లయిన తరువాత ఆ పెళ్లికొడుకులు తమకు రెట్టింపు, మూడు రెట్లు వయసున్న వారని తెలుసుకున్న అమ్మాయిలు లబోదిబోమంటున్నారు.ఖాట్మండుకు పశ్చిమంగా వున్న నువాకోట్ జిల్లాకు చెందిన అవా షెర్పా అనే ఇరవై రెండేళ్ల వధువు తన భర్త 33 సంవత్సరాల యువకుడని మురిసిపోయింది. తీరా కొరియా చేరుకున్నాక తాను వివాహమాడింది మనస్థిమితం లేని ముసలాడినని తెలుసుకుని హతాశురాలయిందని ఖబర్ పత్రిక వెల్లడించింది. ఈ సంబంధాన్ని గత సంవత్సరం ఖాట్మండు బ్యూరో కుదిర్చి, ఆమెనుంచి లక్షల రూపాయలు వసూలుచేసింది. తనను వృద్ధుడి్కి కట్టబెట్టారని ఆమె ఏడ్చి గోలచేయడంతో ఆ వృద్ధుడి కుమారిడికిచ్చి పెళ్లిచేశారు.దక్షిణ కోరియా వంటి అభివృద్ధి చెందిన దేశంలో సుఖంగా జీవించవచ్చని లక్షలాది రూపాయలు ఖర్చుచేసి మోసపోతున్న అమ్మాయిల కథలు ప్రస్తుతం నేపాల్ లో రోజూ వినిపిస్తున్నాయి.
బాగ్లుంగ్ కు చెందిన ఇరవయ్యొక్క సంవత్సరాల శాంతి మగర్ పది లక్షల రూపాయలు బ్రోకర్ కు ఇచ్చి, 35 సంవత్సరాల కొరియా యువకుడిని వివాహమాడింది. కొరియా వెళ్లాక ఆమెను 56 సంవత్సరాల వృద్ధుడికి అప్పగించారు. ఒక్క నేపాలీలే కాదు. ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయిలాండ్, ఇండోనేషియా అమ్మాయిలు కూడా కొరియన్ లను పెళ్లిచేసుకుని దుర్భర జీవితాలు గడుపుతున్నారు. నేపాల్ లో 38 వెళ్లిళ్ల బ్యూరోలు వున్నాయి. వాటిలో 32 బ్యూరోలు ఖాట్మండులోనేో వున్నాయి.కొరియాలో ఐదారేళ్లుండి వచ్చిన నేపాలీలు ఈ బ్యూరోలను నిర్వహిస్తున్నారు.ఒకటిన్నర సంవత్సరాల క్రితం వరకూ రోజుకో అమ్మాయికి కొరియనం లతో వివాహం జరిగేది. ప్రతి నెలా దాదాపు 30 మంది యువతులు ఇక్కడి కొరియా రాయబారి కార్యాలయానికి వెళ్లి వివాహంకోసం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కు దరఖాస్తు చేసుకునే వారు.
2007 డిసెంబర్ నుంచి, విదేశీయుల వివాహాల రిజిస్ట్రేషన్ కు సంబంధించి ప్రభుత్వం కఠినమైన నిబంధనలు అమలులోకి తీసుకురావడంతో, దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. 2007 డిసెంబర్ నుంచి 2008 జనవరి వరకు కేవలం 26 వివాహబాలు మాత్రమే నమోదయ్యాయని అధికారులు తెలిపారు. వృద్ధులకు అమ్ముడుపోయిన యువతులు వివాహాన్ని తిరస్కరిస్తే వారిని చిత్రహింసలకు గురి చేసేవారు. ప్రస్తుతం కొరియాలో హీనమైన పరిస్థితుల్లో బతుకీడుస్తున్న యువతులు 300 మందికి పైగా వున్నారు. అయితే వారిని రక్షించేందుకు కొరియాలోని నేపాల్ రాయబారి కార్యాలయం శతవిధాలా ప్రయత్నించినా, వారు ఇప్పటికే కొరియా పౌరసత్వం పొందినందు వల్ల, సమస్యలు ఎదురవుతున్నాయి.
News Posted: 16 February, 2009
|