ఐపిఎల్ లో శిల్ప ఐటమ్ సాంగ్
ముంబాయి: ఆయీ హూఁ యుపి, బీహార్ లూట్ నే పాటలకి ఒయ్యారాలొలికిస్తూ చేసిన డాన్స్ లతో దేశంలో అభిమానులను క్లీన్ బౌల్డ్ చేసిన బాలివుడ్ భామ శిల్పా శెట్టి ఐపిఎల్ రెండో సీజన్ లో షేన్ వార్న్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టును ఓ పట్టు పట్టడానికి సిద్ధమయింది. శిల్ప ఐటమ్ సాంగ్ లు ఎప్పడూ స్పెషల్ గానే వుంటాయని, ఐపిఎల్ కోసం కోసం రూపొందించిన మ్యూజిక్ వీడియో తన కెరీర్ లో అత్యుత్తమ ఐటమ్ సాంగ్ గా మిగిలిపోవాలని ఆమె ఆశిస్తోందని జట్టు ప్రతినిధి ఒకరు చెప్పారు.
రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యంలో శిల్పా శెట్టికి కూడా భాగస్వామ్యం వున్న విషయం తెలిసిందే. మరో భాగస్వామి, శిల్ప బ్యూటీషియన్ రాజ్ కుంద్రా ఈ మ్యూజిక్ వీడియోను స్పాన్సర్ చేస్తున్నారు. ఆనంద్ రాజ్ బాణీకట్టిన జట్టు థీమ్ సాంగ్ హల్లా బోల్ కు శిల్పా డాన్స్ చేయనున్నది. షాహిద్ కపూర్ తో కామినీ చిత్రం తీస్తున్న కెన్ ఘోష్, శిల్ప వీడియోకు కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. కెన్, ఆనంద్ లకు శిల్పా శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనీ, వారిద్దరితో ఆమె ఇంతకుముందు కలిసి పనిచేసిందని, ఈ ప్రాజెక్టులో పూర్తిగా మమేకమై, ప్రస్తుతం కాస్ట్యూమ్స్ తదితర అంశాలను ఖరారుచేయడంలో నిమక్నమై వుందని రాజస్థాన్ రాయల్స్ ప్రతినిధి చెప్పారు. ప్రేక్షకులను ఇంతకుముందు లేనంతగా ఉర్రూతలూగించడమే లక్ష్యంగా పెట్టుకుందని, దర్శకుడు కెన్ కు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పిందని ఆయన అన్నారు.
ఈ ఐటమ్ సాంగ్ ను మార్చిలో జైపూర్ లో చిత్రీకరిస్తారు. దీనికయ్యే ఖర్చు మూడు కోట్ల రూపాయల్లో మూడా వంతు కుంద్రా, నిగతా సొమ్మును జట్టు ఖాతానుంచి సమకూరుస్తారు. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చీర్ లీడర్స్ ను కనుగొనడానికి, షారుక్ ఖాన్ కింగ్స్, ఏంజెల్స్ మాదిరిగా ఒక టెలివిజన్ రియాల్టీ షోను కూడా శిల్ప రూపొందించాలనుకుంటోంది. ఎస్ 2 ప్రొడక్షన్స్ నిర్మించే దీనికి ఆమె యాంకర్ గా వ్యవహరిస్తుందని, ప్రసారం చేసేందుకు టెలివిజన్ చానెల్స్ తో చర్చలు జరుపుతున్నామని రాయల్స్ ప్రతినిధి చెప్పారు. అయితే ఈ విషయమై వివరణ ఇచ్చేందుకు శిల్పా శెట్టి అందుబాటులో లేదు.
News Posted: 19 February, 2009
|