జీతం పెంపులో 5% కోత
న్యూఢిల్లీ: ఆర్ధిక మాంద్యం ప్రతికూల ప్రభావం భారత దేశ వార్షిక జీతాల పెంపుపై పడనుందని హివిట్ అసోసియేట్స్ హెచ్ ఆర్ కన్సల్టెంట్స్ గురువారంనాడు విడుదలైన నివేదిక వెల్లడించింది. హివిట్ అసోసియేట్స సంస్థ 480 భారతీయ కంపెనీలను అధ్యయనం చేసింది. నిరుడు 13.3 శాతంగా ఉన్న జీతాల పెంపు ఈ ఏడాది 8.82 శాతానికి పడిపోనుందని ఆ అధ్యయనం వెల్లడించింది.
'ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలన్నీ మాంద్యంలోకి జారిపోయినప్పటికీ, భారత ఆర్ధికాభివృద్ధి 7 శాతం దాకా ఉండవచ్చని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.చైనాతో పాటు భారత్ లో కూడా జీతాలు ప్రపంచంలోనే అత్యధికంగా పెరుగనున్నాయి' హివిట్ ఇండియా అధిపతి సందీప్ చౌదరి తెలిపారు. కంపెనీ డిసెంబర్ లో నిర్వహించిన సర్వే ప్రకారం జీతాల పెంపుదల 8.82 శాతానికి దిగింది. అయితే 2009లో జీతాల పెంపుదల శాతం మరో 1-1.5 శాతం తగ్గే అవకాశముందని ఆయన తెలిపారు. దేశంలోని కంపెనీలన్ని ఉన్నత స్థాయి ఉద్యోగుల జీతాల పెంపును రేటును బాగా తగ్గించివేశాయి.
ఫార్మాస్యూటికల్ రంగంలో అత్యున్నత జీతం పెంపు 13 శాతంగా ఉండబోతుందని, ఐటి రంగంలో 6.7 శాతం, రిటైల్ రంగంలో 5.3 శాతం జీతం పెంపు ఉండబోతోందని ఆ అధ్యయనం తెలిపింది. రియాల్టీ, మౌలిక సదుపాయాల రంగంల్లో అధ్యయనం చేపట్టలేదు. ఈ రంగాల్లో ఉద్యోగులు ఉండడమే గగనంగా ఉంది. ఇలాంటి ఉదాసీన పరిస్థితులు నెలకొన్న రంగాల్లో సర్వే నిర్వహించలేదు. భారత్ లో 63శాతం కంపెనీలు తాజా ఉద్యోగ నియామకాలకు శ్రీకారం చుట్టనున్నాయని ఆ అధ్యయనం తెలిపింది. కేవలం 13 శాతం మాత్రమే కొత్త ఉద్యోగ నియామకాల్లో క్షీణత కన్పిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం రియాల్టీ, ఇన్ఫ్రా రంగాలకు చెందిన 37 శాతం కంపెనీలు మాత్రమే కొత్త ఉద్యోగ నియామకాలను పూర్తిగా నిలిపివేశాయి. సగటు రిట్రెంచ్ మెంట్ రేటు అమెరికాలో 51 శాతంగా ఉంటే, చైనాలో 31 శాతంగా ఉన్నట్లు ఆ అధ్యయనం వెల్లడించింది.
News Posted: 19 February, 2009
|