ఎన్నికల 'సిత్రాలు'
హైదరాబాద్: రాజకీయాలు, సినిమాలు పాలు, నీళ్లలా కలిసిపోయాయి. రాజకీయాల పట్ల గతంలో అంతగా ఆసక్తి చూపని సినీవర్గాలు ఇప్పుడు రాజకీయాలవైపు దృష్టి మళ్లిచారు. సినీ కళాకారులు పెద్ద ఎత్తున రాజకీయపార్టీల్లో చేరుతుండడంతో ఆ ప్రభావం వారు తీసే సినిమాలపై తీవ్రంగా ప్రతిఫలిస్తోంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తాజాగా రూపొందుతున్న సినిమాలే ఇందుకు ఉదాహరణ. రాజకీయాలు ప్రధాన కథాంశాలుగా ఆరు చిత్రాలు చకచకా షూటింగులు జరుపుకుంటున్నాయి. వీటిలో ప్రజారాజ్యం నేత చిరంజీవికి అనుకూలంగా కోన్ని, ప్రతికూలంగా కొన్ని రూపుదిద్దుకోవడం విశేషం. ప్రస్తుతం సెట్లమీద వున్న మేస్త్రి, రాజుగారి చేపల చెరువు, అధినేత, నేరము-శిక్ష, మహాత్మా, యువరాజ్యం చిత్రాలు ఆ కోవలోనివే. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి బంధువు సిసి రెడ్డికి చెందిన విసు ఫిలింస్ కూడా ఒక చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనిలో వైఎస్ కొద్దిసేపు ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారు. అయితే వీటిలో ఒకటి రెండు సినిమాలు ఎన్నికల్లోగా విడుదలయ్యే అవకాశాలు లేవంటున్నారు.
కేంద్ర మాజీమంత్రి, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణారావు టైటిల్ పాత్ర ధరించి తెరకెక్కించిన మేస్త్రి సినిమా, ప్రజారాజ్యం నాయకుడు చిరంజీవిని లక్ష్యంగా పెట్టుకుని తీసిందేనని తెలిసింది. రాజకీయాల నేపథ్యంలో తయారైన ఈ చిత్రానికి తమిళ దర్శకుడు సురేశ్ కృష్ణ దర్శకత్వం వహించగా, మోహన్ బాబు, శ్రీహరి ప్రధాన పాత్రలు పోషించారు. అయితే దీనిలోని సన్నివేశాల ఫోటోలను ఇంతవరకూ మీడియాకు విడుదల చేయకపోవడం విశేషం.
రాజకీయాల్లో చిరంజీవికి ప్రత్యర్ధిగా మారిన రాజశేఖర్ హీరోగా నటించి నిర్మించిన సత్యమేవ జయతే సినిమా ఇటీవలే విడుదలయింది. దీనిలో కూడా చిరంజీవిపై కొన్ని పరోక్ష విమర్శలున్నాయి. అటువంటిదేమీ లేదని రాజశేఖర్ వివరణలు ఇచ్చినప్పటికీ, సినిమాలోని డైలాగుల అంతరార్ధాన్ని ప్రేక్షకులు గ్రహించగలరనడంలో సందేహం లేదు. ఆర్టీసి చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎం.సత్యనారాయణరావు ముఖ్యమంత్రి పాత్ర ధరించిన సత్యమేవ జయతే బోల్తాపడింది. ఇంతకుముందు రచయిత మరుధూరి రాజా రూపొందించిన అధ్యక్షా చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. భారత్ బంద్ వంటి రాజకీయ చిత్రాలు నిర్మించిన కోడి రామకృష్ణ, ప్రజారాజ్యం నాయకుడు నాగబాబు కలిసి చేసిన ఏక్ పోలీస్ సినమా కూడా రాజకీయ నేపథ్యంలో నిర్మించిందే. యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నటించిన కొమురం పులి సినిమాలో కూడా రాజకీయ, సామాజిక అఁశాలను మేళవించారట.
ఇక ప్రజలను కేవలం ఓటర్లుగా చూడవద్దు, ప్రజల్లానే చూడకపోవడంవల్ల ఎవరికి ఓటు వేయాలో తేల్చుకోలేకపోతున్నారన్న కథాంశంతో మహాత్మా అనే సినిమా, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ తో, కృష్ణవంశీ దర్శకత్వంలో నిర్మితమవుతోంది. శ్రీకాంత్ హీరో. అలాగే జగపతిబాబు కథానాయకుడుగా రూపొందుతున్న అధినేత చిత్రం కూడా రాజకీయ చిత్రమే. ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగం యువరాజ్యం పేరుతో వీరశంకర్ దర్శకత్వంలో మరో చిత్రం రూపొందుతోంది. అయితే ప్రజారాజ్యం పార్టీకి ఈ సినిమాకు ఎటువంటి సంబంధం లేదని దర్శకుడు చెబుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ ప్రధానపాత్రలో విజయనిర్మల దర్శకత్వంలో నిర్మిస్తున్న నేరము-శిక్ష సినిమా కూడా రాజకీయ నేపథ్యంగలదేనని తెలిసింది. రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి రాజుగారి చేపల చెరువు పేరుతో రాజకీయ చిత్రాన్ని రూపొందించనున్నట్లు వెల్లడించారు.
ఈ సినిమాల్లో ఎన్ని బాక్సాఫీసు బద్దలుకొడతాయో, ఎన్ని బోల్తాపడతాయో వేచి చూడాలి.
News Posted: 20 February, 2009
|