ఆఫర్లే తప్ప జాబ్స్ రాలేదు!
హైదరాబాద్ : నాలుగేళ్ళ క్రితం వారంతా ఇంటర్మీడియట్ లోనూ, ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్టు - ఎమ్సెట్ లోనూ టాపర్లు. దినపత్రికల్లో, టివి చానాల్స్ లో ప్రముఖంగా వారి ఇంటర్వ్యూలు, ఫోటోలు వచ్చాయి, భవిష్యత్ ప్రణాళికలపై వారి అభిప్రాయాలు, టాపర్లు ఎలా కావాలో సూచనలు కూడా వచ్చాయి. మంచి ర్యాంకులతో విజయం సాధించడం వల్ల ప్రముఖ యూనివర్సిటీల్లో సీట్లు వచ్చాయి. చదువు పూర్తికావడానికి ఏడాది ముందే క్యాంపస్ ఇంటర్వ్యూలు పేరిట ఉద్యోగాలు వచ్చాయి. బహుళజాతి కంపెనీలు వారికి ఆఫర్ లెటర్లు ఇచ్చాయి. వారి సంతోషానికి అవధులు లేనేలేవు. ఏడాది తిరగకుండానే ఇపుడు వారి పరిస్థితి దారుణంగా తయారైంది. చదువు చివరి దశకు వచ్చింది. మే నెలలో పరీక్షలు పూర్తవుతాయి, ఉద్యోగం గురించి ఆరా తీస్తే రెండేళ్లు ఆగండి అంటూ కంపెనీలు శ్రీముఖాలు పంపుతున్నాయి. ఇప్పుడు దిగ్ర్భాంతి చెందడం వారి వంతైంది. నాలుగేళ్ల చదువు పూర్తయింది కాని, ఉద్యోగాల కోసం వారు ఎదురు చూడాల్సిన పరిస్థితి, ఆర్థిక సంక్షోభంతో వచ్చింది. చాలా కంపెనీలు వేచి ఉండమని చెప్తున్నాయి అని జె.ఎన్.టియు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.ఎన్.రెడ్డి పేర్కొన్నారు.
యూనివర్సిటీల్లోని విద్యార్థుల పరిస్థితే ఇలా ఉంటే ఇక మామూలు కాలేజీల్లో చదివే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని జె.ఎన్.టియు ప్రొఫెసర్లు అంటున్నారు. యూనివర్సిటీ విద్యార్థుల్లో 83 శాతం మందికి ఆఫర్ లెటర్లు వచ్చాయి, అంత వరకూ బాగానే ఉన్నా, అనూహ్యంగా ఆర్థిక సంక్షోభం వచ్చి పడడంతో ఉద్యోగాలు దొరకని పరిస్థితి ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఈ సంక్షోభం దాటాలంటే కనీసం ఏడు సంవత్సరాలు పడుతుందని, దీనిని అధిగమించేందుకు ఇప్పుడు ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నవారు నేరుగా ఉన్నత విద్యకు వెళ్లడం మేలని నిపుణులు చెప్తున్నారు. లేదా వారు కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ ను నేర్చుకోవడం ఉత్తమమని ఉద్యోగాల కోసం ఎదురు చూసే బదులు ప్రత్యామ్నాయ కోర్సులపై దృష్టి పెట్టాలని సలహా ఇస్తున్నారు.
రాష్ట్రంలో ఈ సంవత్సరం దాదాపు 45 వేల మంది ఇంజనీరింగ్ కోర్సును పూర్తి చేసే అవకాశం ఉంది. వారిలో కేవలం రెండు మూడు వేల మందికి మించి ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదని అసోచం ప్రతినిధులు చెప్తున్నారు. మిగిలిన వారి పరిస్థితి ఏమిటన్నదానికి నిపుణుల వద్ద సమాధానం లేదు. గతంలో రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కొన్ని ప్రైవేటు కాలేజీల్లో కూడా క్యాంపస్ రిక్రూట్ మెంట్ లు జరిగేవి. దాదాపు అరడజను కాలేజీల్లో ఈ తరహా సౌకర్యం ఉండడంతో 10 లక్షల వరకూ ఫీజులు చెల్లించి విద్యార్థులు వాటిలో చేరారు. ఇప్పుడు ఆ కాలేజీలు క్యాంపస్ రిక్రూట్ మెంట్ గురించి మాట్లాడడం లేదు. కొన్ని కాలేజీలు చిన్న చిన్న ఉద్యోగాలు ఇప్పించి పెద్ద సంస్థల బ్రాండ్ పేర్లను వాడుకుంటున్నాయి.
News Posted: 21 February, 2009
|