హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లోనే మళ్లీ పోటీచేయాలనుకుంటున్న పార్టీ సీనియర్ నాయకులు కొందర్ని లోక్ సభకు పంపించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు. శ్రీకాకుళం లోక్ సభ స్థానానికి మళ్లీ కె.ఎర్రన్నాయుడు ఇప్పటికే ఖరారుకాగా, రాజమండ్రి నుంచి గోరంట్ల బుచ్చయ్యచౌదరిని నిలబెట్టాలనుకుంటున్నారు. తాను అసెంబ్లీకే పోటీచేస్తానని చౌదరి చెప్పినా పార్లమెంటుకు పోటీచేయాలని చంద్రబాబు చెప్పారట. రాజమండ్రిలో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉండవల్లి అరుణ్ కుమార్ బరిలోకి దిగితే తెలుగుదేశం ఘనవిజయం సాధిస్తుందని తెలుగుదేశం అధినేత జరిపించిన సర్వేలో వెల్లడయింది. ఉండవల్లి పోటీచేస్తే ఓటమి తప్పదని భావిస్తున్న కాంగ్రెస్ రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురందరేశ్వరిని నిలబెట్టాలని చూస్తోంది. కాంగ్రేస్ అభ్యర్ధి ఎవరైనా బుచ్చయ్య చౌదరినే తమ అభ్యర్ధిగా తెలుగుదేశం ప్రకటిస్తుందని సమాచారం.
మరో సీనియర్ నాయకుడు, పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడును విశాఖపట్నం లేదా కాకినాడ లోక్ సభ స్థానంలో నిలబెట్టాలని చంద్రబాబు ప్రతిపాదిస్తున్నారు. ఒకవేళ రామకృష్ణుడు అందుకు అంగీకరించకపోతే కాకినాడ బరిలో మాజీమంత్రి చిక్కాల రామచంద్రరావును దింపాలనుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో బలమైన కాపువర్గానికి చెందిన రామచంద్రరావు సునాయాసంగా గెలుస్తారని చంద్రబాబు నమ్మకం. తాను మళ్లీ తుని అసెంబ్లీ స్థానానికే పోటీచేస్తానని యనమల చెప్పినప్పటికీ చంద్రబాబు అంగీకరింలేదని సీనియర్ నాయకులు కొందరు లోక్ సభకు పోటీచేయక తప్పదని చెప్పారని తెలిసింది.
ప్రస్తుతం శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా వున్న దాడి వీరభద్రరావును అనకాపల్లి లేదా విశాఖపట్నం లోక్ సభ స్థానాలకు నిలబెట్టే అవకాశాలు కలిపిస్తున్నాయి. తాను అసెంబ్లీకి పోటీచేస్తానని గత మండలి ఎన్నికలకు ముందే దాడి చెప్పినప్పటికీ స్థానిక సంస్థల నుండి ఆయనను శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికచేయించారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆయనను ఎంపిగా నిలబెడితే బాగుంటుందన్న అభిప్రాయానికి చంద్రబాబు వచ్చారు. వెనుకబడిన తరగతుల సామాజిక వర్గానికి చెందిన వీరభద్రరావు విశాఖజిల్లాలో మచ్చలేని నాయకుడుగా పేరుతెచ్చుకున్నారు. ఆ జిల్లాలో గవర సామాజిక వర్గానికి బలమైన నాయకుడుగా కూడా దాడి పేరుపొందారు. విశాఖజిల్లాలో వాణిజ్యశాఖ మంత్రి కొణతాల రామకృష్ణను ఎదుర్కోవడం వీరభద్రరావుకే సాధ్యమవుతుందని చంద్రబాబు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
అనకాపల్లి లోక్ సభ స్థానానికి పోటీచేయాలని మాజీమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉవ్వీళ్లూరుతున్నారని తెలిసింది. విశాఖ లోక్ సభ స్థానానికి పోటీచేయాలనుకుంటున్న మాజీ ఎంపి ఎంవివిఎస్ మూర్తిని ఈసారి రాజమండ్రినుంచి నిలబెట్టాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని తెలిసింది. మాజీమంత్రి కోడెల శివప్రసాదరావును కూడా లోక్ సభకు పోటీచేయించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఆయన ప్రాతినిధ్యం వహించిన నరసరావుపేట నియోజకవర్గంలోని సొంత మండలం పునర్విభజనలో సత్తెనపల్లి నియోజకవర్గంలోకి మారడంతో ఆయన ఈ టికెట్ ఆశిస్తున్నారు. అయితే సత్తెపల్లి నియోజకవర్గానికి ఎవరిని నిలబెట్టాలన్న అంశంపై చంద్రబాబు చర్చల అనంతరం అభ్యర్ధిని ఖరారుచేయడంతో ఆయన నరసరావుపేట నియోజకవర్గం నుంచి పోటీకి సమాయత్తమవుతున్నారు. అయితే గుంటూరునుంచి పోటీకి సిద్ధంకావాలని కొడెలకు ఇప్పటికే చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది.
గతంలో కర్నూలు లోక్ సభ నియోజకవర్గంలో పోటీచేసి గెలుపొందిన ప్రముఖ బిసి నాయకుడు కెఇ కృష్ణమూర్తిని తిరిగి అక్కడినుంచే పోటీకి నిలబెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే తాను డోన్ అసెంబ్లీ స్థానానికి పోటీచేస్తానని, తన సోదరుడు కెఇ ప్రభాకర్ కు పత్తికొండ అసెంబ్లీ సీటు కేటాయించాలని కృష్ణమూర్తి చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారు. పత్తికొండ నియోజకవర్గాన్ని తనకు లేదా తన కుమారుడు మోహన్ రెడ్డికి కేటాయించాలని ఎస్.వి.సుబ్బారెడ్డి కోరుతున్న విషయం తెలిసిందే. పోలిట్ బ్యూరో సభ్యుడు లాల్ జాన్ బాషాను నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీకి నిలబెట్టాలని చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారు. కర్నూలు లోక్ సభ స్థానానికి కెఇ కృష్ణమూర్తి అంగీకరించకపోతే అక్కడ పోటీకి ఇద్దరు జర్నలిస్టులు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. ఈ నియోజకవర్గంలో బోయ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు నాలుగున్నర లక్షలకు పైగా ఉన్నాయని, అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యక్ధిని ఎంపికచేయడం ద్వారాఆ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవచ్చని చంద్రబాబును కలిసిన సందర్భంగా కెఇ కృష్ణమూర్తి చెప్పినట్టు తెలిసింది. మాజీమంత్రి ఎన్.ఎం.డి ఫరూక్ నంద్యాల అసెంబ్లీ స్థానానికి పోటీచేయాలని భావిస్తున్నప్పటికీ, చంద్రబాబు మాత్రం ఆయనను లోక్ సభకు పంపాలనుకుంటున్నట్టు తెలిసింది.ఇటీవలే తెలుగుదేశం విడిచిపెట్టి ప్రజారాజ్యంలో చేరిన భూమా నాగిరెడ్డిని ఈ నియోజకవర్గంలో నిలబెట్టే అవకాశం వున్నందున అందుకు దీటైన అభ్యర్ది ఫరూక్ అవుతారని దేశం అధిషష్టానం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
బాపట్ల లోక్ సభ స్థానాన్ని ఎస్సీలకు రిజర్వు చేయడంతో అక్కడినుంచి మాజీమంత్రి జెఆర్ పుష్పరాజ్ లేదా మాజీ పోలీసు అధికారి బాలకొండయ్యలలో ఎవరో ఒకరినిఅభ్యర్ధిగా ఎంపికచేసే అవకాశాలున్నాయి. మచిలీపట్నం లోక్ సభ స్థానానికి మాజీ విప్ కాగితం వెంకటరావు పేరును చంద్రబాబు పరిసీలిస్తుండగా, ఆయన మాత్రం అసెంబ్లీ బరిలో దిగుతానని చెప్పారట. దీనితో ీ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎన్.సాంబశివరావు యాదవ్ లేదా కె.నారాయణ పేర్లను పరిశీలిస్తున్నారు.