ఖరీదైన ఖైదీ కసబ్
ముంబై : లష్కర్-ఎ-తోయిబా (ఎల్ఇటి) ఉగ్రవాది మహమ్మద్ అజ్మల్ కసబ్ ఇండియాలో అత్యంత వ్యయభరితమైన ఖైదీగా రూపుదాల్చాడు. 2008 నవంబర్ 26న ముంబైలో ముగ్గురు అత్యుత్తమ పోలీసు అధికారులను హతమార్చిన ఆ వ్యక్తికి కల్పిస్తున్న భద్రత వల్ల ప్రభుత్వ ఖజానాకు ఇంత వరకు రూ. 50 లక్షలు ఖర్చయినట్లు అంచనా. ఇది ప్రారంభం మాత్రమే. కసబ్ కనీసం రెండు నెలల పాటు కస్టడీలో ఉంటాడు. అందువల్ల ఈ ఖర్చు సహజంగానే పెరగగలదు.
నవంబర్ 26 నాటి మారణకాండలో 172 మందిని హతమార్చిన, 500 మందికి పైగా గాయపరచిన పది మంది ఎల్ఇటి ఉగ్రవాదులలో సజీవంగా ఉన్నది కసబ్ కనుక అతని భద్రత కీలకం. అతనిని విచారణకు హాజరు పరిస్తే ముంబై దాడులలో పాకిస్తాన్ పాత్ర నిర్థారితం కాగలదు. ఆర్థర్ రోడ్ జైలులో కసబ్ ఉన్న సమయంలో అతని హత్యకు కుట్ర జరిగినట్లు గూఢచారి నివేదికలు సూచించిన దృష్ట్యా అతని కోసం చేస్తున్న భద్రతా ఏర్పాట్లు ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి.
కసబ్ ను అంతం చేసేందుకు కాంట్రాక్టును మాఫియా నాయకుడు దావూద్ ఇబ్రహీంకు, అతని కుడి భుజం చోటా షకీల్ కు అప్పగించారు. వాస్తవానికి పాకిస్తానీ ఐఎస్ఐయే ఈ కాంట్రాక్టుకు వ్యూహరచన చేసి ఉండవచ్చు. నవంబర్ 26 నుంచి కసబ్ క్రైమ్ బ్రాంచ్ సిఐయు (క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్) సెల్ లో ఉన్నాడు. కాని వచ్చే వారం అతని కేసు విచారణకు వచ్చినప్పుడు అతనిని పూర్వపు టాడా కోర్టుకు 50 మీటర్ల దూరంలోని ఆర్థర్ రోడ్ జైలు లోపల గల ప్రత్యేక సెల్ కు మారుస్తారు. పూర్వపు టాడా కోర్టును ఇప్పుడు ప్రత్యేక విచారణ న్యాయస్థానంగా పేర్కొంటున్నారు.
15\15, కిటికీ రహిత సెల్ గ్రెనేడ్ దాడులకు తట్టుకుని నిలబడగలదు. ఎందుకంటే దీని గోడలు, సీలింగ్, పిల్లర్లను 'హై టెన్సైల్ స్టీల్' తో తయారు చేశారు. వెంటిలేషన్ కోసం రెండు గొట్టాలు ఉంటాయి. ఎటువంటి వ్యక్తుల కదలికలను గమనించేందుకు సెల్ లోపల, సైల్ పైకప్పు పైన పెక్కు సిసి టివిలు ఉంటాయి. రానున్న కొన్ని రోజులలో ప్రత్యేక కెమెరా యూనిట్లను ఏర్పాటు చేస్తారు.
#MUlti
సెల్ కు చుట్టూ కనీసం ఆరు బంకర్లు ఉంటాయి. వాటి వద్ద ఆరుగురు అత్యున్నత స్థాయి శిక్షణ పొందిన పోలీసులు కాపలాగా ఉంటారు. జైలు లోపల ఎటువంటి దాడి జరగకుండా చూడడం ఈ ఏర్పాట్ల లక్ష్యం. ఉక్కు ప్లేట్లు, ఉక్కు వైర్ మెష్ తో తయారు చేసిన బంకర్లను దృఢమైన ఉక్కు గోడగా మలిచారు. క్షిపణి దాడులను నిరోధించడానికే ఇన్ని జాగ్రత్తలు. కింద నుంచి భద్రతకు విఘాతం కలగకుండా సెల్ కు, ఈ బంకర్లకు మధ్య ఒక ఎండిపోయిన కందకం ఉంటుంది.
ఇదిలా ఉండగా, పబ్లిక్ వర్క్స్ శాఖ అనుమతించిన కాంట్రాక్టర్ పనిని ప్రారంభించడానికి ముందే సెల్ చుట్టూ భద్రతను ఇప్పటికే కట్టుదిట్టం చేశారు. ఆ ప్రదేశం సమీపానికి వెళ్ళడానికి అనుమతించే ముందు వర్కర్లను నిశితంగా తనిఖీ చేస్తున్నారు. కసబ్ గురించి గాని భద్రతా ఏర్పాట్ల గురించి గాని ఏ వివరాలనైనా వెల్లడించడానికి పోలీస్ జాయింట్ కమిషనర్ (క్రైమ్) రాకేష్ మారియా నిరాకరించారు. కాని, ఆర్థర్ రోడ్ జైలు లోపల ప్రత్యేక సెల్ నుంచి విచారణ నిర్వహించగలరని ఆయన ధ్రువీకరించారు.
కసబ్ కు సాలెం సలాం
ఇదిలా ఉండగా, జ్యుడీషియల్ ప్రక్రియలో భాగంగా కసబ్ ను రెండు రోజుల పాటు ఆండ సెల్ లో నిర్బంధించినప్పుడు మాఫియా నాయకుడు, 1993 ముంబై వరుస పేలుళ్ళ ప్రధాన నిందితుడు అబూ సాలెం బుధవారం రాత్రి అతనిని సందర్శించినట్లు తెలుస్తున్నది. కసబ్ నేరాంగీకార ప్రకటనను ఒక మేజిస్ట్రేట్ సమక్షంలో గురువారం మధ్యాహ్నం నమోదు చేశారు.
News Posted: 21 February, 2009
|