'ఊక'దంపుడు ఉపన్యాసాలు
హైదరాబాద్: సినిమాల్లో సుదీర్ఘమైన భారీ డైలాగులతో ప్రేక్షకులను అదరగొట్టే నాయికా నాయకులు బహిరంగ సభల్లో ప్రసంగించడానికి తత్తరపడి పోతున్నారు. ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అయినా, తెలుగు దేశం హీరో బాలకృష్ణ కానీ, కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ రాజశేఖర్ అవనీ, వారు చేసే ప్రసంగాలు నిస్తేజంగా ఉంటున్నాయి. ప్రేక్షకులకు బోర్ కొట్టించి, అభిమానులను నిరాశ పరుస్తున్నారు. 'చిరంజీవి పొలిటికల్ స్పీచ్ ల్లో పంచ్ ఉండడం లేద'ని తెలుగు దేశం పోలిట్ బ్యూరో సభ్యుడు నాగం జనార్దన రెడ్డి ఉవాచ. ఎన్టీయార్ కు, చిరంజీవికి ఈ విషయంలో హస్తి మశకాంతరం అని ఆయన వ్యాఖ్యానించారు.
ఎర్ర గురివింద సామెతలా, చిరంజీవి ప్రసంగాలను తెలుగు దేశం విమర్శిస్తోంది కాని ఆ పార్టీ నాయకుడు బాలకృష్ణ ప్రసంగాలు కూడా ఫ్లాప్ లే! ఆయనగారి ప్రసంగాల్లో కూడా ఎన్టీయార్ 'పంచ్' ఏ కోశానా లేదు. 'చిరంజీవి కాని, బాలకృష్ణ కాని తమ పార్టీల విధానాలపై స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారు. వినేవారిని ఉత్సాహపరచ లేక పోతున్నాయి వారి ప్రసంగాలు' అన్నారు పిసిసి అధికార ప్రతినిధి కులసి రెడ్డి.
చిరంజీవి అయితే సినిమా డైలాగులు చెబుతూ, మీసం మెలేసి, తొడ కొడితే కాని ప్రేక్షకుల నుంచి కరతాళ ధ్వనులు రాబట్టలేక పోతున్నారు. మరో వైపు తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా, చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ కొంత వరకూ ప్రేక్షకులను తమ ప్రసంగాలతో కదిలించ గలుగుతున్నారు. కాకపోతే వారి ప్రసంగాలు వివాదాలను రేకెత్తిస్తూ, రాజకీయ ప్రత్యర్ధులకు ఎదురు దాడులు చేయడానికి వారి చేతికి అస్త్రాలను ఇస్తున్నాయి.
రాష్ట్ర మంత్రి షబ్బీర్ అలీపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు, కాంగ్రెస్ కార్యకర్తల నిరసన ప్రదర్శనలకు దారి తీశాయి. ్లాగే పవన్ కల్యాణ్ పై రోజా చేసిన విమర్శలు ప్రజారాజ్యం కార్యకర్తల ఆగ్రహానికి తావిచ్చాయి. ఈ నేపథ్యంలో మరింత మంది సినీ తారలు వచ్చే ఎన్నికల ప్రచారంలో కేంద్ర బిందువులు కానున్నారు. తెలుగు దేశం తరఫున జూనియర్ ఎన్టీయార్, తారకరత్న రంగ ప్రవేశం చేయనుండగా, చిరంజీవి సోదరుడు నాగేంద్రబాబు జిల్లా పర్యటనలకు బయలుదేరనున్నారు. మరి వీరి ప్రసంగాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
News Posted: 22 February, 2009
|