మందు మరీ 'చిందు'
హైదరాబాద్: దేశం మొత్తం మీద ఎన్నికల నిర్వహణకు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే, ఒక్క ఆంధ్రప్రదేశ్ లో కేవలం రెండు నెలల్లో మద్యం కోసం 2,500 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేశారట! అంటే ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆర్ధిక మాంద్యం మన రాష్ట్రంలో మద్యం వ్యాపారం జోలికి మాత్రం రాలేకపోయింది. నగదు మారకం ఓ వైపు తగ్గిపోతున్నా మందు వ్యాపారం మరో వైపు శరవేగంతో పెరిగిపోతోంది. ఎన్నికల ముందు, తరువాత 'సుర'ఏరులను పారించేందుకు తయారీదారులు, విక్రేతలతో పాటు ప్రభుత్వం కూడా రంగంలోకి దిగుతున్నాయి. ఈసారి విశేషం ఏమిటంటే, ఇంతకు మునుపెన్నడూ లేని విధంగా, అధికారం కోసం మూడు ప్రధాన పార్టీలు పోటీ పడడం.
అంతే కాదు. అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్ధులు మూడు నుంచి ఐదు కోట్ల రూపాయలు, పార్లమెంటుకు పోటీచేసే అభ్యర్ధులు ఇరవై నుంచి పాతిక కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా వున్నారు. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా అభ్యర్ధుల మొత్తం ఖర్చు 5,000 కోట్ల రూపాయలు కాగా, అందులో సగం కేవలం మద్యం కోసం ఖర్చు పెడతారన్నమాట. మరి ప్రభుత్వానికయ్యే ఖర్చు మాత్రం 200 కోట్లే! ఎన్నికల సమయంలో ఇంత డిమాండ్ ఉంటుందని ముందుగా అంచనా వేయబట్టే ఈ ఆబ్కారీ సంవత్సరం ప్రారంభంలో నిర్వహించిన వేలంపాటకు అనూహ్యమైన స్పందన వచ్చిందని చెబుతున్నారు. గత సంవత్సరం కంటె 200 శాతం ఎక్కువగా చెల్లించి మద్యం దుకాణాలను కొనుక్కున్నారు.
రాబోయే ఎన్నికలు రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలకు అగ్ని పరీక్షే. తొమ్మిదేళ్ల నిరీక్షణ తరువాత దక్కిన అధికారాన్ని నిలబెట్టుకోవడం వైఎస్ కు ఎంత ముఖ్యమో, ఐదేళ్లపాటు ప్రతిపక్షంగా గడిపిన తెలుగుదేశం మరింత నిర్వీర్యం కాకుండా కాపాడుకోవడం చంద్రబాబుకు అంతే ముఖ్యం. ఇక సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన మెగాస్టార్ చిరంజీవి అధికారం కైవసం చేసుకో లేకపోతే త్రిశంకు స్వర్గంలో చోటు ఖాయం. అందువల్లనే ఇంతటి కీలకమైన ఎన్నికల సందర్భంలో, కేవలం ఓట్లపైనే దృష్టి కేంద్రీకరించిన నాయకులు మద్య నిషేధం గురించి ఒక్క మాటైనా మాట్లాడ్డం లేదు.
News Posted: 22 February, 2009
|