గెలుపు గుర్రాల కోసం...
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపొందే అభ్యర్ధుల కోసం ప్రజారాజ్యం పార్టీ అన్వేషిస్తోంది. తాము పోటీ చేసే అన్ని నియోజకవర్గాల్లో అత్యంత సమర్ధవంతులైన అభ్యర్ధులను బరిలో దించాలని పార్టీ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినంత వరకూ కనీసం 250 గెలుపు గుర్రాలు అవసరం కాగా ఇంతవరకూ సుమారు 100 మందిని గుర్తించింది. వచ్చే నెల ప్రారంభంలో కనీసం 70 మంది అభ్యర్ధుల పేర్లు ప్రకటించవచ్చు. అప్పటికి మరో 150 మంది అభ్యర్ధులను ఖరారు చేయాల్సి వుంటుంది.
అభ్యర్ధుల ఎంపికకు ప్రజారాజ్యం పార్టీ ఆరు ప్రధానమైన అర్హతలను పరిగణించనున్నది. అవి సచ్ఛీలత, నైతిక విలువలు, నేర చరిత్ర లేకపోవడం, పార్టీ సభ్యుడుగా కనీసం కొన్ని నెలల అనుభవం, పోటీ చేయదలచుకున్న నియోజకవర్గాలలో ప్రజలతో సత్సంబంధాలు, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండడం. రాష్ట్రంలోని 66 రిజర్వుడు నియోజకవర్గాలకు సంబంధించినంత వరకు అభ్యర్ధుల ఎంపికలో ప్రజారాజ్యం పార్టీకి ఎటువంటి సమస్యలు లేవు.
ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలకు సుమారు 15 మంది అభ్యర్ధులను ఖరారు చేశారు. తెలంగాణలోని కొద్దిపాటి జిల్లాలు మినహా మిగిలిన రిజర్వుడు నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఎంపికచేయడం కూడా ఆ పార్టీకి కష్టం కాదు. అయితే సరైన అభ్యర్ధులను గుర్తించి ఎంపిక చేయకపోతే మాత్రం విజయావకాశాలు సన్నగిల్లిపోతాయని సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. కేవలం తన పేరు చెప్పి ఓట్లు రాబట్టడం సాధ్యం కాదనే వాస్తవాన్ని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి కూడా గ్రహించారని ఆయన చెప్పారు.
News Posted: 23 February, 2009
|