మహిళల చేతికి వార్ షిప్స్!
న్యూఢిల్లీ: భారతీయ నౌకాదళంలో పురుషాధిక్యానికి చివరి చిహ్నం త్వరలో చరిత్ర పుటల్లోకి వెళ్ళిపోగలదు. యుద్ధ నౌకలలో మహిళలను నియోగించేందుకు ప్రాతిపదికను నౌకాదళం సిద్ధం చేస్తున్నది. వారు ఈ బాధ్యతలను నిర్వర్తించడానికి తగినవారు కాదని ఇంతకాలం భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఇంకా ఆమోదముద్ర వేయవలసి ఉంది. కాని నౌకాదళ ప్రధాన కార్యాలయం దూరదృష్టితో వ్యవహరిస్తున్నది. భవిష్యత్తులో అన్ని యుద్ధ నౌకలలో మహిళల కోసం ప్రత్యేకంగా బెర్తింగ్ సదుపాయాలు ఉంటాయని పేరు వెల్లడికి ఇష్టపడని నౌకాదళ సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు.
నౌకాదళంలో 7336 మంది ఆఫీసర్లు ఉండగా వారిలో మహిళల సంఖ్య 258 మాత్రమే. ఇండియాలో నిర్మించనున్న అతి పెద్ద యుద్ధ నౌక 'స్వదేశీ విమాన వాహక నౌక (ఐఎసి)'లో వారిలో కొందరు విధులు నిర్వర్తించవచ్చు. సాగరంలోకి ప్రవేశపెట్టినప్పుడు ఆ రూ.3260 కోట్ల యుద్ధ నౌక 1600 మంది సెయిలర్లు, 30 విమానాలను తీసుకువెళ్ళగలదు. వాటిలో మిగ్-29 యుద్ధ విమానాలు, దేశంలో తయారుచేసిన తేలికరకం యుద్ధ విమానాలు (ఎల్ఎసి) కూడా ఉంటాయి.
అమెరికా, రష్యా, ఫ్రాన్స్ మాత్రమే ఈ పరిణామంలో విమానవాహక నౌకలను నిర్మించాయి.త్వరలో సాగర పరీక్షలకు సిద్ధమయ్యే శివాలిక్-క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్లు, తాజా కోలకతా-క్లాస్ డిస్ట్రాయర్లను కూడా మహిళల నియామకానికి అనువైనవిగా రూపొందించారు. జడ్జి అడ్వొకేట్ జనరల్ (జెఎజి), సైనిక విద్యా మండలి (ఎఇసి)తో సహా అన్ని విభాగాలలోను, నౌకా, వైమానిక దళాలలోని సంబంధిత విభాగాలలోను మహిళా ఆఫీసర్లకు శాశ్వత కమిషన్ మంజూరు చేయాలని రక్షణ మంత్రిత్వశాఖ గత సెప్టెంబర్ లో నిర్ణయించింది. అయితే, పోరు బాధ్యతల నుంచి వారిని ఇక ముందు కూడా మినహాయిస్తారు. పదాతిదళం, ఆర్మర్డ్ కోర్ లలోను, యుద్ధ విమానాలలోను, యుద్ధ నౌకలలోను పని చేయకుండా వారిని మినహాయిస్తారు.
News Posted: 24 February, 2009
|