త్వరలో బయోటెక్ బియ్యం
న్యూఢిల్లీ: పోషక విలువలతో కూడిన బయోటెక్ బియ్యాన్ని రూపొందించడంపై భారత్ తీవ్రంగా కృషి చేస్తోంది. భారత దేశంలో మహిళలు శిశువుల్లో పోషకాహారం లోపం ఒక పెద్ద సమస్యగా నిలిచింది. దీన్ని అధిగమించే లక్ష్యంతో మాంసకృత్తులు, ఐరన్ ధాతువులు అధికంగా ఉండే బయోటెక్ బియ్యాన్ని రూపొందించే పరిశోధనలు సాగుతున్నాయి. 2011-12 నాటికి అనుమతులు రాగానే అలాంటి బయోటెక్ బియ్యం అందరికి అందుబాటులోకి రానుందని కోలకత విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సవాపన్ దత్త మంగళవారంనాడు తెలిపారు.
2017 నాటికి భారత జనాభా 130 కోట్ల రూపాయలకు పెరిగి పోగలదని దత్త తెలిపారు. 14 మిలియన్ టన్నుల ధాన్యం కొరతను భారత్ ఎదుర్కోబోతోందని ప్రభుత్వం అంచనా వేసింది. తక్కువ ఉత్పత్తి, పెరుగుతున్న డిమాండ్ల నేపథ్యంలో ధాన్యం ఉత్పత్తిని గణనీయంగా పెంచడం ఇప్పుడు దేశం ఎదుర్కునే పెను సవాలుగా ఆయన తెలిపారు. దేశ ప్రజలు జొన్నల తర్వాత బియ్యాన్ని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. 'బయోటెక్ బియ్యం దిగుబడిని రెట్టింపు చేస్తుంది. తక్కువ దిగుబడినిచ్చే సాంప్రదాయక వరి ధాన్యం అంతరించిపోకుండా నిరోధిస్తుంది'అని ఆయన తెలిపారు. పోషక విలువలున్న ధాన్యాన్ని రూపొందించడంలో తీవ్రంగా కృషి చేస్తున్నట్లు సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (సిఆర్ఆర్ఐ) కటక్ ప్లాంట్ అధిపతి జిజెఎన్ రావు తెలిపారు. ఈ బియ్యం పెస్టిసైడ్స్ వినియోగాన్ని తగ్గించివేసి పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుందని రావు తెలిపారు.
News Posted: 24 February, 2009
|