మహా'ముసలం పుట్టిందట?
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో 40 లోక్ సభ, 185 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధుల జాబితాను తయారు చేసినా, దానిని బయట పెట్టేందుకు ముందు వెనకలాడుతోందట! తెలుగు దేశం సారథ్యంలోని మహా'కోట'మి బీటలు వారక పోతుందా అని ఆశ పడుతుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇప్పటికే ఆభిప్రాయ భేదాలు, కొన్ని స్పర్ధలతో సతమతమవుతున్న మహాకూటమిలో ముసలం ఏర్పడి, తెలంగాణా రాష్ట్ర సమితి వంటి 'మిత్ర'పక్షాలు తెగతెంపులు చేసుకుని బయటపడక పోతాయా అని బిజెపి ఎదురు చూస్తోందట. అందుకే ఇప్పటికే సిద్ధమైన తమ అభ్యర్ధుల జాబితాను వెల్లడించడం లేదట. కొన్ని అసెంబ్లీ సెగ్మెట్లలో ప్రత్యామ్నాయ అభ్యర్ధుల పేర్లను కూడా ఎంపిక చేసినా, మిగిలిన పార్టీల అభ్యర్ధులెవరో వెల్లడైతే, కుల మతాల ప్రాతిపదికన తమ జాబితాలో మార్పులు చేసి ప్రకటించాలని బిజెపి భావిస్తున్నట్టు తెలిసింది.
మరోవైపు ప్రజారాజ్యం పిలవక పోతుందా, నవ తెలంగాణా ముందుకు రాక పోతుందా, టిఆరేస్ తోనే కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచనలతో రాష్ట్రంలో కమలనాధులు సతమతమవుతున్నారట. అంతే కాకుండా, కొందరు ప్రవాస భారతీయులు(ఎన్నారైలు)తెలంగాణ అనుకూల పార్టీల మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నాలు ప్రారంభించడం కూడా బిజెపి నాయకుల్లో కోత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. ఇంతకుముందు పొత్తులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా, ఆ తరువాత మహాకూటమి ఏర్పడ్డం బిజెపిని కుంగదీసింది. తాజాగా, మహాకూటమిలో ముసలం పుట్టిందని, ఆ పార్టీ నాయకులు డోలాయమాన స్థితిలో పడ్డారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ నిర్ధారించేశారు. మహాకూటమి ఎప్పుడైనా విచ్ఛిన్నం కావచ్చని, ఆ తరువాత ఏం జరుగుతుందో ఊహించవచ్చని ఆయన ముందే ఊహా లోకాల్లో విహరించేస్తున్నారు. బిజెపి బలం రోజు రోజుకూ పెరిగిపోతోందని, ఇటీవలి అద్వానీ సభల పర్యవసానంగా ప్రజల నుంచి భారీగా స్పందన లభిస్తోందని సంబర పడిపోతున్నారు.
News Posted: 24 February, 2009
|