ఏపిలో 737 మోడల్ స్కూల్స్
న్యూఢిల్లీ: విద్యా విషయంగా వెనుకబడ్డ ప్రాంతాల్లో 3,500 ఆదర్శ పాఠశాలలను (మోడల్ స్కూల్స్) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 11వ పంచవర్ష ప్రణాళికలో ఎడ్యుకేషనల్లీ బ్యాక్ వార్డ్ బ్లాక్స్ (ఈబిబి) వద్ద ఏర్పాటు చేస్తున్న ఈ మోడల్ స్కూల్స్ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా 737 స్కూళ్ళను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పాఠశాల్లోని అకాడమిక్, మౌలిక సదుపాయల ప్రమాణాలన్నీ కేంద్రీయ విద్యాలయాల తీరులో రూపొందిస్తారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 702 మోడల్ స్కూళ్లను, బీహార్లో 530, ఝార్ఘండ్ 203, మద్యప్రదేశ్ 201, రాజస్తాన్ 186, ఒరిస్సా 173, జమ్మూ-కాశ్మీర్ 97 మోడల్ స్కూళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. విద్యలో అత్యంత పురోగతి సాధించిన కేరళలో ఒకే ఒక మోడల్ స్కూల్ ను ఏర్పాటు చేస్తున్నారు. 6 వేల మోడల్ స్కూళ్ల ఏర్పాటు గాను 2009-10 మధ్యంతర బడ్జెట్లో ఉపా ప్రభుత్వం దాదాపు 312 కోట్ల రూపాయలను కేటాయించింది. వాటిలో ప్రభుత్వం కేవలం 3,500 స్కూళ్లను మాత్రమే ఏర్పాటు చేసి నడుపుతుంది, మిగిలిన 2,500 స్కూళ్లను ప్రభుత్వ-ప్రైవేట్-భాగస్వామ్య పద్ధతిలో (పిపిపి) ఏర్పాటు చేస్తారు.
ఈ స్కూల్ ను ఏర్పాటు చేసే ప్రాంతం, క్లాస్ రూమ్ విస్తీర్ణం, ఆట స్థలం, గ్రంథాలయం, వైద్య పరీక్షల కేంద్రం, ఉపాధ్యాయుల శిక్షణ ల్లాంటి పలు అంశాలన్నిటిలో కేంద్రీయ విద్యాలయాల నిబంధనలను అనుసరించి ఈ స్కూళ్లను తీర్చి దిద్దుతారు. ఉపాధ్యాయుడు-విద్యార్ధుల నిష్పత్తిని 1:40 గా నిర్ణయించారు. ఈ మోడల్ స్కూళ్లను రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా నిర్వహిస్తాయి. అయితే కేంద్రం ఒక్కొక్క స్కూల్ కు 4 కోట్ల రూపాయల నిధిని అందజేస్తుంది. అయితే ఈ స్కూళ్లు సిబిఎస్ఈని గాని స్టేట్ బోర్డులను గాని అనుసరించవచ్చు. ఈ స్కూళ్లలో చేరే విద్యార్ధులను సర్వ శిక్ష అభియాన్ ద్వారా పెద్ద సంఖ్యలో తీసుకోవడం జరుగుతుంది. సర్వశిక్ష అభియాన్ ద్వారా ప్రాథమిక విద్యలో దాదాపు 97 శాతం నమోదు జరుగతోంది. అదే సెకండరీ విద్యలో 52 శాతం మాత్రమే ఎన్ రోల్ మెంట్ ఉంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకే మోడల్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే పిపిపి పద్దతి అమలుకు ప్లానింగ్ కమీషన్ అనుమతి కోసం చూస్తున్నారు.
News Posted: 25 February, 2009
|