ఇక గాలిలో ప్రకటనలు!
చండీగఢ్ : మీ ఇంటి పరిసరాలలో ఏదైనా విమానం వెనుక ఒక బ్యానర్ రెపరెపలాడుతూ మీ కంట పడితే బెదరిపోకండి. అది కొత్త పుంతలు తొక్కుతున్న లేదా కొత్త ఎత్తులకు వెళుతున్న ప్రకటన లోకం మాత్రమే. విమానాల సాయంతో ప్రకటనలు చేయడానికి బ్యానర్లను ఎగురవేయడానికి గగనతలాన్ని ఉపయోగించుకునేందుకు 'స్కై యాడ్స్' సంస్థకు పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ (డిజిసిఎ) అనుమతి ఇచ్చారు. కొత్త వాణిజ్య ప్రకటనల మాధ్యమానికి ఈ సంస్థ సూత్రధారి అని పేర్కొనవచ్చు. ఈ కొత్త్ ప్రకటనలను ప్రయోగాత్మకంగా మార్చి నెల మధ్యలో పంజాబ్, హర్యానా, చండీగఢ్ లలో ప్రదర్శిస్తారు.
'గగనతలంలో లోగోలతో పాటు మీ సందేశం ప్రచారానికి మేము ఏర్పాట్లు చేస్తాం' అని స్కై యాడ్స్ సంస్థ ఎండి ఎస్.ఎస్. ధిల్లాన్ తెలియజేశారు. 'ఈ స్పేస్ లో ఇతర ప్రకటనలతో బ్యానర్ పోటీ చేయవలసిన అవసరం ఉండదు కనుక దానిలోని సందేశం తప్పకుండా అధిక సంఖ్యాక ప్రజలను ఆకర్షించగలదు' అని ఆయన సూచించారు. గగనతలంలో ప్రకటనలకు ఆఫర్ ఇస్తున్న స్కై యాడ్స్ ఇండియాలో తొలి సంస్థ. భద్రత, రక్షణ వంటి అంశాలపై డిజిసిఎను ఒప్పించడానికి కొంత సమయం పట్టిందని ధిల్లాన్ తెలియజేశారు.
నిర్దుష్ట భౌగోళిక ప్రదేశాలను లక్ష్యం చేసుకుంటూ, డిస్ప్లే ఫ్రీక్వెన్సీలో క్లయంట్లకు దీనివల్ల కొంత వెసులుబాటు లభిస్తుంది. ఇండియాలో ఈ ఆలోచన వినూత్నమైనదైనా యుఎస్. యూరప్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియాలలో ఇది చాలాకాలంగా ఆచరణలో ఉన్నది. స్కై యాడ్స్ సంస్థ ఇందు నిమిత్తం అమెరికా నుంచి ఒక పైపర్ విమానాన్ని కొనుగోలు చేసింది. 'ఈ బాధ్యత నిర్వహణ కోసం మా పైలట్ కు ఆస్ట్రేలియాలో శిక్షణ ఇప్పించాం' అని ధిల్లాన్ తెలియజేశారు.
గగనతలంలో ప్రకటనకు గరిష్ఠ ఎత్తు 7 అడుగులు. మొత్తం విస్తీర్ణం వెయ్యి, మూడు వేల చదరపు అడుగుల మధ్య ఉంటుంది. విమానం వెయ్యి అడుగుల ఎత్తులో, గంటకు 50 నుంచి 55 మైళ్ళ వేగంతో ఎగురుతుంది. క్లయంట్లు కనీసం ఒక గంట ఎగిరే సమయాన్ని కొనుగోలు చేయవలసి ఉంటుంది.
News Posted: 27 February, 2009
|