కృష్ణయాదవ్ కు దేశం ఛాన్స్?
హైదరాబాద్: మాజీ మంత్రి కృష్ణయాదవ్ అంబర్ పేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయవచ్చని తెలిసింది. నకిలీ స్టాంపుల కుభకోణంలో జైలుశిక్ష అనుభవించిన కృష్ణయాదవ్ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలోని నియోజకవర్గాలలో పరిస్థితిని సమీక్షించిన దేశం అధినేత చంద్రబాబు, అంబర్ పేట నియోజకవర్గం నుంచి బిసి అభ్యర్ధిని పోటీకి నిలబెట్టనున్నట్టు చెప్పడంతో, యాదవ్ కు అవకాశం లభించవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో బిజెపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకుడైన వి.హనుమంతరావు మంచి పలుకుబడి కలిగి ఉన్నందున, తెలుగుదేశం నుంచి బలమైన అభ్యర్ధిని నిలబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నట్టు చెబుతున్నారు.
కృష్ణయాదవ్ జైలులో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీలో స్థానికంగా పట్టు సంపాదించారని, అయితే ఆయన అభ్యర్ధిత్వాన్ని ముందుగా ప్రకటిస్తే విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో చివరిలో ఆయన పేరు ప్రకటించే అవకాశం ఉందనీ పార్టీ వర్గాలు తెలిపాయి. చంద్రబాబుతో ఇప్పటికే రండిసార్లు సమావేశమైన కృష్ణయాదవ్, స్టాంపుల కేసులో తన తప్పేమీ లేదని వివరించారని, అలాగే హరికృష్ణ, బాలకృష్ణ లను కూడా కలిసి తెలుగుదేశంలో చేరేందుకు సహకరించాల్సిందిగా కోరారని తెలిసింది. అంబర్ పేటలో దాదాపు 1.30 లక్షలమంది బిసిలు ఉన్నందు వల్ల అక్కడ బిసి అభ్యర్ధినే నిలబెట్టాలని చంద్రబాబు నిర్ణయించారని తెలిసింది. కాంగ్రెస్ అభ్యర్ధిగా సినీ నటి జీవిత పోటీ చేయవచ్చనుకుంటున్నారు.
News Posted: 1 March, 2009
|