భువనగిరిపై మిత్రుల పేచీ
హైదరాబాద్: భువనగిరి లోక్ సభ స్థానం కోసం ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ విషయమై అవతలి పక్షానికి నచ్చచెప్పి, ఆ సీటు తమకు వదిలిపెట్టేలా ఒప్పించాలని తమ తమ కేంద్ర నాయకత్వాలను రాష్ట్ర నాయకులు కోరుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం భువనగిరి లోక్ సభ నియోజకవర్గం ఏర్పడింది. ప్రస్తుత నల్గొండ ఎంపి, సిపిఐ నాయకుడు సురవరం సుధాకర రెడ్డి, అసెంబ్లీలో సిపిఎం నాయకుడు నోముల నర్సింహయ్య ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఇది చాలదన్నట్టు ఇక్కడి నుంచి సినీ నటి విజయశాంతిని నిలబెట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఆలోచిస్తోంది.
నల్గొండ లోక్ సభ స్థానాన్ని రద్దు పరచి, భువనగిరి నియోజకవర్గాన్ని సృష్టించారని, అందువల్ల ప్రస్తుత నల్గొండ సభ్యుడు సుధాకర రెడ్డికి అక్కడినుంచి పోటీచేసే అవకాశం ఇవ్వాలని సిపిఐ పట్టుపడుతోంది. అంతేకాకుండా అక్కడ తమకు ప్రజాదరణ ఎక్కువగా ఉందని కూడా వాదిస్తోంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ మహాకూటమి నాయకత్వానికి ఈ విషయాన్నే స్పష్టంగా చెప్పారు. మరో సిపిఐ నాయకుడి బేరం ఏమిటంటే, సుధాకర రెడ్డికి భువనగిరి సీటు వదిలిపెడితే, కూటమి కేటాయించే సీట్ల సంఖ్య తగ్గించుకోడానికి తమ పార్టీ సిద్ధమేనట! అయితే భువనగిరి విషయంలో రాజీకి వారు సిద్ధంగా లేరట. మరోవైపు సిపిఎం కూడా తల పట్టు సడలించడానికి అంగీకరించడం లేదు.కొత్తగా ఏర్పడినభువనగిరి నియోజకవర్గంలోను, అందులోని మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోను తమ బలమే ఎక్కువని ఆ పార్టీ చెబుతోంది.
News Posted: 1 March, 2009
|