'ఒబామా అయినా గెలవలేరు'
హైదరాబాద్: ప్రపంచ ప్రజల్ని అమితంగా ఆకర్షించిన బరాక్ ఒబామా అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయం. ఆయనకు ప్రజామోదం లేక కాదు. డబ్బు లేక ఒబామా తప్పక ఓడిపోగలరు. ఇద్దరు అమెరికా అధ్యక్షులకయ్యే ఎన్నికల ఖర్చు ఆంద్రప్రదేశ్ లో ఒకే ఒక అసెంబ్లీ అభ్యర్ధి ఖర్చు చేయడం ఆశ్చర్యమే. మనవాళ్లు అంతంత ఖర్చు పెడుతున్నందుకు కాక, అమెరికా అధ్యక్షులు అంత తక్కువగా ఖర్చు చేస్తున్నందుకు మనకు ఆశ్చర్యం కలుగుతుంది.
రెండేళ్లపాటు 50 రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీలకు, ప్రధాన ఎన్నికలకు గాను బరాక్ ఒబామా, జాన్ మెకెయిన్ లు ఇద్దరు 866 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. అంటే వారిద్దరూ దాదాపు 866 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అదే ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎన్నికలకు గాను, రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీల ఖర్చు 4-5 వేల కోట్ల రూపాయలుంటుందని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అంచనా వేశారు. అమెరికాలో ఖర్చు చేసిన డబ్బు కంటే ఏపి లో ఎన్నికలకయ్యే ఖర్చు దాదాపు నాలగైదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం పట్ల 'ఆంధ్ర ఒబామా' లు విచారించవలసి ఉంది. గత 10-15 ఏళ్లుగా ఎన్నికల ఖర్చు చుక్కలు తాకుతోంది.
ఎన్నికల్లో ఎవడి అదృష్టం ఎలా ఉన్నప్పటికీ, పోటీ పడి గెలిచే అభ్యర్థులు మాత్రం సంచుల కొద్దీ డబ్బును ఖర్చు పెట్టక తప్పదు. రాజకీయాలను ఫక్తు వ్యాపార లావాదేవీలుగా మార్చడమేనని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మూల పోటీ చేసినప్పటికీ, ఒక్కొక్క అసెంబ్లీ అభ్యర్ధికి 3-5 కోట్ల రూపాయలు ఖర్చయితే, పార్లమెంట్ అభ్యర్ధికి దానికంటే మూడు నుండి అయిదు రెట్లు ఎక్కువ ఖర్చవుతుంది. 'ధనవంతులకు రాజకీయాలు ఒక వ్యాపారం లాంటివి. వారి దగ్గర ఉన్న నల్లడబ్బును ఎన్నికల ఖర్చులో కలిపేస్తారు. గెలిచిన తర్వాత అంతకు పలు రెట్లు వివిధ రూపాల్లో డబ్బు గుంజేస్తారు. వాళ్లు నల్ల డబ్బు కాకపోతే, మరో రకం అరువు సొమ్మును ఖర్చు చేస్తారు.#Multi
ఎన్నికల ఖర్చుకు గాను ఒక్కొక్క అభ్యర్ధి 10 లక్షల రూపాయల కంటే అదనంగా ఖర్చు పెట్టకూడదన్న ఎన్నికల కమీషన్ నిబంధనను దేశం ఏ ఒక్క రాజకీయ నాయకుడు అనుసరించడు. అయితే ఇంత డబ్బు ఎందుకు ఖర్చవతున్నట్లు? ఒక అసెంబ్లీ నియోజక వర్గాన్ని తీసుకుంటే, అక్కడ పెట్టే ఎన్నికల ఖర్చులో ప్రధాన భాగం వోటర్లకు తినడానికి, తాగడానికి అందించడానికే సరిపోతుంది. ఆ ఖర్చులో గణనీయమైన భాగం ఆర్భాటాలకు ఖర్చు చేయవలసి వస్తుంది. రోడ్ షోలకు, ర్యాలీలకు, అందుకోసం తోలుకుని వచ్చే ప్రజలకు ఇచ్చే మందు, పోగొట్టుకున్న కూలి డబ్బులు, బిర్యానీ, మంచినీళ్లు వగైరాలకు ఖర్చు చేయవలసి ఉంటుంది.
రాజకీయ 'దురంధురలను' ఆకట్టుకునేందుకు, లంచాలకు పెద్ద ఎత్తున ఖర్చవుతుంది. రాజకీయ పార్టీలు ప్రచార, ప్రసార కార్యక్రమాలపై పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. పార్టీ విధి విధానాలను ప్రజలకు పెద్ద ఎత్తున చేరవేయాలంటే ఈ ఖర్చు తప్పదు మరి. సొంత పార్టీని పొగిడి, పోటీ పార్టీల పై బురద జల్లేందుకు మీడియా ఖర్చు తప్పనిసరి. వ్యక్తిగత దాతల నుండి మాత్రమే అమెరికా పార్టీలు నిధులను సమకూర్చుకోవలసి ఉంటుంది. ఇలా సేకరించిన డబ్బుకు పైసా పైసా లెక్క చెప్పవలసి ఉంటుంది. అయితే భారత దేశంలో అలాంటి బాధ్యతలు లేవు, అకౌంట్లు ఉండవు. అడిగే నాధుడే ఉండడు. అందువల్ల అక్రమార్జనలు, స్పెక్యూలివ్ డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు వినియోగిస్తున్నారు. భయంకరమైన నల్ల డబ్బు సంస్కృతి దేశంలో విలయతాండవం చేస్తోంది. ఎన్నికలు ఆ సాంస్కృతిక వేదికలుగా చాలా శక్తివంతంగా పనిచేస్తున్నాయి.
News Posted: 2 March, 2009
|