బెంగళూరు: భారత ఐటి సంస్థలకు మరో చిక్కు వచ్చిపడింది. అంతర్జాతీయ ఖాతాదారులు తమ కాంట్రాక్టులను కొనసాగించేందుకు ఐటి కంపెనీలతో పున: సంప్రదింపులు ప్రారంభించాయి. దాదాపు 15 శాతం ధరలను ఐటి సంస్థలు తగ్గించాలని సదరు ఖాతాదారులు ఒత్తిడి చేస్తున్నారు. ధరల విషయంపై గత రెండు నెలల నుండి సంప్రదింపులు సాగుతున్నాయి. డిసెంబర్ లో, ధరల క్షీణింపు 1-2 శాతంగా ఉండేది. ఐటి కంపెనీల్లో దాదాపు 20-25 శాతంగా ఉండే ఆపరేటింగ్ ప్రాఫిట్స్ పై ఈ ధరల తగ్గింపు తీవ్ర ప్రభావమేస్తుంది.
కొంతమంది ఖాతాదారులు స్పెక్ట్రమ్ మొత్తంగా ధరల తగ్గింపును డిమాండ్ చేస్తున్నారు. ఈ తగ్గింపుపై తాజా కాంట్రాక్టుల కేటాయింపులు ఆధారపడి ఉన్నాయని విప్రో టెక్నాలజీస్ సిఎఫ్ ఓ మనీష్ దుగార్ తెలిపారు. కాంట్రాక్ట్ సంప్రదింపుల సందర్భంగా 4-15 శాతం ధరల తగ్గింపు కోసం ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు. వినియోగదారులు తమ ఖర్చులను తగ్గించుకునే కార్యక్రమంలో భాగంగా ఈ విధమైన ధరల తగ్గింపుకు డిమాండ్ చేస్తున్నారు. ధరల నిర్ణయం సమస్య మాత్రమే కాదు, అదొక ఆందోళనకరమైన అంశంగా పరిణమించింది. మూడవ త్రైమాసికంలో మా ధరల్లో 1.8 శాతం క్షీణించాయి. ఇప్పుడు పరిస్థితి మరింత ఘోరంగా తయారైందని ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ సిఎఫ్ ఓ బాలక్రిష్ణన్ తెలిపారు.#Multi
ఐటి రంగ వ్యాపారం దెబ్బతినక ముందు ధరల విషయంలో ప్రత్యేకమైన సంప్రదింపులుండేవి కావు. ఆర్ధిక సంక్షోభం కారణంగా పెద్ద విదేశీ ఖాతాదారులందరు తమ సంస్థల్లో పలు పొదుపు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా సాప్ట్ వేర్ పై పెట్టే పెట్టుబడి ఖర్చులు తగ్గించివేశాయి. అదే సమయంలో పలు ఐటి ప్రాజెక్టులను వచ్చే ఏడాదిలో చేపట్టేందుకు వాయిదా వేసుకున్నాయి. దాంతో ఐటి వ్యాపారంలో ఉదాసీనత నెలకొంది. దాంతో పలు ఐటి కంపెనీలు తమ ధరలను తగ్గించుకునేందుకు సిద్దపడుతున్నాయి. 'ఐటి రంగంలోని స్తబ్దతను మేము పలు వ్యాపార చిట్కాల ద్వారా ఎదుర్కోవాలనుకుంటున్నాము.ఆన్ సైట్-ఆఫ్ షోర్ పద్దతులను మేళవించడంలాంటి పలు పద్దతులను మేము కొత్తగా చేపట్టనున్నాము'అని విప్రో దుగార్ తెలిపారు.
ఆపరేటింగ్ లాభాన్ని దాదాపు 24 శాతం సాధించగలనన్న ధీమాను టిసిఎస్ కంపెనీ వ్యక్తం చేసింది. ఆఫ్ షోర్ ప్రాంతాలకు ఎంత ఎక్కువ పనిని తరలించగల్గితే అంత ఆపరేటింగ్ లాభాన్ని పొందగలమని టిసిఎస్ అధికార ప్రతినిధి తెలిపారు. ధరల తగ్గింపు ఒత్తిడి వచ్చే ఆర్ధిక సంవత్సరం దాకా కూడా కొనసాగే అవకాశముంది. 2010లో 5-6 శాతం ధరల ఐటి సేవల ధరలు తగ్గిపోయే అవకాశముందని షేర్ ఖాన్ కు చెందిన ఐటి నిపుణుడు గౌరవ్ దువా తెలిపారు. ఐటి కంపెనీలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కునేందుకు సిద్దపడాలి. వేరియబల్ జాతాలను ఐటి కంపెనీలు సవరించాల్సి ఉంటుందని దువా తెలిపారు. ఆఫ్ షోర్ పనిని పెంచడమే కాకుండా, టర్న్ కీ లేదా స్థిరమైన ధరల ప్రాతిపదిక పద్దతులనుఅమలు చేయవలసి ఉంటుందని టిసిఎస్ తెలిపింది. ఆఫ్ షోర్-ఆన్ షోర్ నిష్పత్తి ప్రస్తుతం 70:30గా ఉంది. ఐటి కంపెనీలు మరింతగా ఆఫ్ షోర్ వైపుకు మొగ్గవలసి ఉంటుందని ఇన్ఫోసిస్ బాలక్రిష్ణన్ తెలిపారు. దీర్ఘకాల కాంట్రాక్టులపై ధరలను స్థిరీకరించడం కీలకమైనదని టెక్ మహీంద్ర తెలిపింది.