తల్లీ కొడుకులకు అగ్ని పరీక్ష!
లక్నో: ఉత్తర ప్రదేశ్ లో రానున్న లోక్ సభ ఎన్నికలు తల్లీ కొడుకుల ద్వయాలకు అగ్ని పరీక్ష కానున్నాయి. ఆ ద్వయాలు రెండూ గాంధీ వంశీకులు కావడం విశేషం. ఆసక్తికరమైన మరొక విషయమేమిటంటే తల్లీ కొడుకుల ద్వయాలు రెండూ యుపి రాష్ట్రంలోనే వేర్వేరు ప్రాంతాలలో పక్క పక్క నియోజకవర్గాల నుంచి పోటీ చేయనుండడం. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాయబరేలి నుంచి, ఆమె కుమారుడు, మున్ముందు ప్రధాని కాగల అవకాశాలు ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అమేథి నుంచి పోటీ చేయనున్నారు.
ఇలా లోక్ సభ ఎన్నికలలో రెండవసారి పోటీ చేస్తున్న మొదటి ద్వయం వీరే. అయితే, రాహుల్ గాంధీకి సోదరుడి వరస అయ్యే వరుణ్ గాంధీ మొదటిసారిగా పిలిభిత్ లోక్ సభ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన తల్లి, మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ ఆరవసారి లోక్ సభ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. స్వర్గీయ సంజయ్ గాంధీ భార్య అయిన మేనక కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాకు స్వయానా తోటి కోడలు.
ఈ పోలికలు ఇక్కడితే ఆగిపోలేదు. కుటుంబానికి పెట్టని కోట అయిన అమేథిని కుమారుడు రాహుల్ కోసం వదలి 2004లో రాయబరేలి నుంచి పోటీ చేసిన సోనియా గాంధీ వలె మేనకా గాంధి కూడా తనకు సురక్షితమైన, 'కచ్చితంగా' గెలిచే పిలిభిత్ స్థానాన్ని కుమారుడు వరుణ్ కోసం వదిలారు. దాదాపుగా కొత్త నియోజకవర్గమైన అవొన్లా నుంచి మేనక రానున్న ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు. ఈ స్థానానికి ప్రస్తుతం కున్వర్ సర్వరాజ్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 2004లో జనతా దళ్ (యు) టిక్కెట్ పై ఈ నియోజకవర్గంలో గెలుపొందారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్ డిఎ)లో భాగస్వామ్య పక్షమైనందున జెడి (యు) ఈ స్థానాన్ని మేనకకు వదలివేయడానికి అంగీకరించింది. మేనక ఈ విషయమై ఇంతకుముందు జెడి (యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ తో మాట్లాడారు.
అయితే, ఈ రెండు ద్వయాల మధ్య ఒకే ఒక తేడా ఉంది. అదేమిటంటే మేనక, వరుణ్ ద్వయానికి ప్రియాంక వాద్రా సేవలు లభించవు. రాహుల్, సోనియా తరఫున ఎన్నికల ప్రచారం బాధ్యతను ప్రియాంక భూజానికి ఎత్తుకున్నారు. రాహుల్ గాంధీ తరహాలోనే వరుణ్ గాంధీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. 1999లో తాను గెలుచుకున్న అమేథి స్థానాన్ని సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ కోసం వదలుకున్నారు. సోనియా అమేథిని వదలిపెట్టి ఆ పొరుగునే ఉన్న రాయబరేలికి తరలివెళ్ళారు. అదే విధంగా మేనకకు ఇప్పుడు అవొన్లా వోటర్లను ఆకట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.
News Posted: 4 March, 2009
|