తగ్గిన ఆఫీసు అద్దెలు
ముంబై: ఆర్ధిక సంక్షోభం అద్దె వ్యాపారాన్ని సైతం దెబ్బ తీసింది. దాంతో ఆఫీసుల అద్దెలు 20 శాతం దాకా క్షీణించాయి. ఐటి రంగం దెబ్బతినడంతో అద్దె వ్యాపారం ఐటి మార్కెట్ నుండి ఐటి యేతర రంగాలపై దృష్టి సారించింది. ఐటి, బిపిఓ రంగాలు గడ్డుకాలంలో ఉన్నందున అద్దెల్లో కొంత డిస్కౌంట్ ఇచ్చేందుకు డెవలపర్స్ సిద్దపడుతున్నారు. నాన్ ఇన్ఫోటెక్ కంపెనీలకు అద్దె లకిచ్చేందుకు అనువుగా చిన్న చిన్న ఆఫీసులను డెవలపర్స్ రూపొందిస్తున్నారు. వాణిజ్యపరమైన ఆస్తుల మార్కెట్ బాగా క్షీణించిందని రియాల్టీ కంపెనీలు, కన్సల్టెంట్స్ తెలిపారు.ఐటి పరిశ్రమలో నెలకొన్న మాంద్యం కారణంగా దేశంలోనే పేరున్న రియాల్టీ సంస్థ తాను నిర్మించ తలపెట్టిన ఆరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్కుల్లో రెండింటి నిర్మాణాన్ని నిలిపివేసింది.
ప్రపంచ ఆర్ధిక సంక్షోభం కారణంగా ఐటి సంస్థలు తమ ఆఫీసు స్పేస్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించివేసాయి. ప్రాజెక్టులు లేక కొత్తగా సిబ్బందిని నియమించుకునే కార్యక్రమానికి ఐటి సంస్థలు స్వస్తి చెప్పాయి. దాంతోపాటు ఉన్న సిబ్బందిని తొలగిస్తూ మరింత స్లిమ్ గా తయారు కావడంతో ఆపీసు స్పేస్ వినియోగం మరింతగా తగ్గిపోయింది. రియాల్టర్లు రూపొందించే ఆఫీసు స్పేస్ లో 70-80 శాతం వినియోగించుకునే ఐటి రంగం కుదేలవడంతో వాణిజ్య ఆస్తుల వ్యాపారం బాగా దెబ్బతినిపోయింది. డిఎల్ఎఫ్ డెవలపర్ 16 మిలియన్ చదరపు అడుగుల ఆఫీసు ప్రాంత నిర్మాణానికి, 62 మిలియన్ చదరపు అడుగుల వాణిజ్య సముదాయాల నిర్మాణానికి స్వస్తి చెప్పింది.
ముంబై, బెంగళూరు, నేషనల్ కేపిటల్ రీజియన్లలో ఆఫీసుల కిరాయిలు దాదాపు 20-30 శాతానికి క్షీణించాయి. చాలా వాణిజ్య సముదాయాలు ఎవరూ వినియోగించకుండా ఖాళీగా పడివున్నాయి. 2007లో ఖాళీ ప్రాంతాలు 5 శాతంగా ఉండేవి. 2008లో ఆఫీసు ప్రాంతం 8-9 శాతం ఖాళీగా ఉన్నాయి. ఐటి డిమాండ్ తగ్గడమే కాకుండా ఐటి యేతర కంపెనీలు అద్దెల్ని తగ్గించాలని కోరుకుంటున్నాయి. దాంతో ఆఫీసు ప్రాంతాలను కుదించి నిర్మాణం చేపడుతున్నామని పర్ స్వాంత డెవలపర్స్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నీతల్ నారంగ్ తెలిపారు.
News Posted: 8 March, 2009
|