లోక్ సభ మెట్లెక్కని బర్ధన్
నాగపూర్: కమ్యునిస్టు కురువృద్ధుడు సిపిఐ ప్రధాన కార్యదర్శి ఏబి బర్ధన్ తన సుదీర్ఘ పార్లమెంటరీ రాజకీయ జీవితంలో ఇంతవరకు పార్లమెంట్ ముఖం చూసి ఎరుగక పోవడం దురదృష్టకరం. ఆయన రాజకీయ జీవితం నాగపూర్ నుండి ప్రారంభమై జాతీయ స్థాయికి చేరింది. అయితే ఒక జాతీయ స్థాయి పార్టీకి నాయకత్వం వహిస్తున్న ప్రముఖుడు పార్లమెంట్ మెట్లెక్కలేక పోవడం ఇంతవరకు లేదు. ఇందులో కూడా బర్దన్ జాతీయ రికార్డు సృష్టించారు.
ఏబి బర్ధన్ 5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఒకేఒక్కసారి 1957లో నాగపూర్ నుండి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. అయితే ఆయన ఆనాడు స్వతంత్ర అభ్యర్ధిగా ఎంపిక కావడం విశేషం. మహారాష్ట్రలోని నాగపూర్ లో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలుండేవి. బర్ధన్ కు 26,666 ఓట్లు వచ్చాయి. 1967లోను, 1980లోను ఆయన నాగపూర్ నియోజవర్గం నుండి లోక్ సభ ఎన్నికల్లో విఫల ప్రయత్నం చేశారు. ఆయన 1967లో తొలిసారి నాగపూర్ నుండి లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచారు. ఆ సమయంలో ఏడు మంది పోటీలో ఉన్నారు. అయితే ఆ సమయంలో విదర్భ ప్రాంతం కాంగ్రెస్ పాలనలో ఉండేది. నరేంద్ర దేవఘరే చేతిలో బర్ధన్ వోడిపోయారు. నాగపూర్ పోలింగ్ లో 3,71,951 మొత్తం వోట్లు పడగా, అందులో దేవఘరేకి 1,36,134 వోట్లు రాగా, బర్ధన్ కు 1,02,286 వోట్లు వచ్చాయి.
బర్దన్ నిరాశ చెందకుండా తిరిగి 1980లో నాగపూర్ లోక్ సభ నియోజక వర్గం నుండి రెండవసారి పోటీ చేసి వోడిపోయారు. ఈ సమయంలో మొత్తం విదర్భ ప్రాంతమంతా కాంగ్రసె విజయకేతనం ఎగురవేసింది. ఆ ప్రాంతానికి చెందిన 11 లోక్ సభ సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఆ సమయంలో విదర్భ ఉద్యమానికి సారధ్యం వహిస్తున్న జాంబవంత రావుకు 2,46,397 వోట్లు రాగా, రెండవ స్థానంలో ఆర్ పిఐ (ఖోబ్రాగేడ్) శ్యామ్ ఖోబ్రగేడ్ కు 2,46,397 వోట్లు వచ్చాయి. మూడవ స్థానంలో బర్ధన్ కు 70,689 వోట్ల వచ్చి ఓడిపోయారు. బర్ధన్ మినహా విదర్భ ప్రాంతం నుండి లోక్ సభకు ఎంపికయ్యారు. వార్ధా నుండి రామచంద్ర ఘంగారే, అమరావతి నుండి సుదం దేశముఖ్ లు ఎమ్ పిలుగా ఎంపికయ్యారు
News Posted: 9 March, 2009
|