మళ్ళీ వైఎస్ ఖాయం: సర్వే
హైదరాబాద్: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ 155 నుంచి 169 అసెంబ్లీ సీట్లతో తిరిగి అధికారంలోకి రాగలదని తెలుగు న్యూస్ చానల్ ఎన్టీవి నిర్వహించిన ఒక సర్వే నివేదిక వెల్లడించింది. అసెంబ్లీలో సాధారణ మెజారిటీకి కావలసిన 148 సీట్ల కన్నా కాంగ్రెస్ కు ఎక్కువే వస్తాయని దీనిని బట్టి విదితం అవుతున్నది. ఈ సర్వే ప్రకారం, తెలుగు దేశం పార్టీ (టిడిపి) నాయకత్వంలోని మహాకూటమికి 92 నుంచి 110 సీట్ల వరకు లభిస్తాయి. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలోని ప్రజారాజ్యం పార్టీ (పిఆర్ పి)కి 30 నుంచి 35 సీట్ల వరకు, ఇతరులకు ఏడు నుంచి తొమ్మది వరకు సీట్లు వస్తాయి.
ఎన్ టివి న్యూస్ చానెల్ నీల్సన్ ఒఆర్ సి మార్గ్ లిమిటెడ్ తో కలసి ఈ సర్వే నిర్వహించింది. ఫిబ్రవరిలో నిర్వహించిన ఈ సర్వేలో ప్రతి నియోజకవర్గంలో దాదాపు 300 మంది వోటర్లు వంతున 88,146 మందిని ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ కు రాష్ట్రంలోని 42 సీట్లలో 23 నుంచి 27 వరకు దక్కుతాయని సర్వే సూచించింది. మహా కూటమికి 14 నుంచి 16 వరకు, పిఆర్ పికి ఒకటి రెండు సీట్లు రావచ్చు.
ఇక ప్రాంతాలవారీగా ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ కు తెలంగాణలోని 119 సీట్లలో 37, 45 మధ్య, కోస్తా ఆంధ్రలోని 124 సీట్లలో 77, 78 మధ్య సీట్లు లభించగలవు. రాయలసీమలో కాంగ్రెస్ కు 35, 41 మధ్య సీట్లు లభించవచ్చునని సర్వే సూచించింది. మహా కూటమికి తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర అనుకూల వైఖరి వల్ల 52 నుంచి 70 వరకు సీట్లు రావచ్చు. ఈ కూటమికి ఆంధ్రలో 20, 24 మధ్య, రాయలసీమలో 13, 15 మధ్య సీట్లు లభిస్తాయని సర్వే సూచించింది.
ఇవే సంస్థలు ఇంతకుముందు నిర్వహించి పోల్ లో సూచించిన ఫలితాలతో పోలిస్తే ఈ సారి ప్రజారాజ్యం పార్టీకి వోట్లు తగ్గిపోయాయి. ఈ పార్టీకి తెలంగాణలో కేవలం 4 నుంచి 6 సీట్లు, రాయలసీమలో రెండు మూడు సీట్లు రాగలవు. కోస్తా ఆంధ్రలో మాత్రం ఈ పార్టీకి 21 నుంచి 28 మధ్య సీట్లు రాగలవని సర్వే సూచించింది.
News Posted: 9 March, 2009
|