కేవీపి అడుగు జాడల్లో...!
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డికి రాజకీయ సలహాదారుడు, సన్నిహిత సహచరుడు డాక్టర్ కె.వి.పి. రామచంద్రరావు 'కింగ్ మేకర్'లు కావాలని ఆకాంక్షిస్తున్న ప్రతిపక్షాల నాయకులకు 'రోల్ మోడల్' అయ్యారు. తెలుగు దేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రజారాజ్యం పార్టీ (పిఆర్ పి) అధ్యక్షుడు చిరంజీవి తదుపరి రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నిస్తుండగా వారి సన్నిహిత సహచరులు డాక్టర్ కెవివి ఇప్పుడు పోషిస్తున్న పాత్రను తరువాత తాము పోషించాలని ఆశిస్తున్నారు.
చిరంజీవి బావమరది అల్లు అరవింద్ సచివాలయంలోని 'డి' బ్లాక్ తన గమ్యమని ప్రకటించినట్లు తెలుస్తున్నది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో డాక్టర్ కెవిపి ఈ బ్లాక్ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారు. టిడిపి వర్గాల అభిప్రాయం ప్రకారం, ఈ విషయంలో పారిశ్రామికవేత్తలు వైఎస్ చౌదరి, సి.ఎం. రమేష్ మధ్య 'మ్యూజికల్ చైర్స్' ఆట సాగుతోంది.
అయితే, 'చంద్రబాబు నాయుడు కనుక తిరిగి అధికారంలోకి వస్తే ఆయన ఒక కింగ్ మేకర్ ను కలిగి ఉండాలని అనుకోవడం లేదని గాని, ఆయనకు అటువంటి వ్యక్తి సాయం అవసరం లేదని గాని ఈ ఇద్దరు పారిశ్రామికవేత్తలు గ్రహించడం లేదు' అని టిడిపి సీనియర్ నాయకుడు ఒకరు పేర్కొన్నారు. పి. ప్రభాకరరెడ్డి వంటి పారిశ్రామికవేత్తలు కొందరిని కొంత కాలం తరువాత పక్కకు నెట్టిన సందర్భాలను పార్టీ నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా, కెవిపి అసాధారణ వ్యక్తిత్వానికి అధికార పార్టీ మురిసిపోతున్నదని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు పేర్కొంటూ, జిల్లాలలో మంత్రులకు లేదా శాసనసభ్యులకు సన్నిహితులుగా పేరు పొందిన వారు ఆయా నాయకుల పరంగా తాము కెవిపి వంటి వారమని చెప్పుకుంటుంటారని వెల్లడించారు.
డాక్టర్ కెవిపి రామచంద్రరావు ఇటువంటి స్థాయిని అనుభవించడం రాష్ట్ర రాజకీయాలలో ఇదే ప్రథమం. ప్రస్తుత ప్రభుత్వంలో ఆయన పాలనకు, రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాలలో నిర్ణయాత్మక పాత్ర పోషించారు. ఆయనను రాజ్యాంగేతర అధికారిగా విమర్శకులు చిత్రిస్తున్నప్పటికీ, ఆయనను ముఖ్యమంత్రికి నమ్మకస్థుడైన, సమర్థుడైన, విశ్వసనీయుడైన సలహాదారునిగా పరిగణించేవారు అనేక మంది ఉన్నారు.
News Posted: 9 March, 2009
|