'మూర్తి' తప్ప దిక్కెవరు?
విశాఖపట్నం: విశాఖపట్నం లోక్ సభ నియోజకవర్గంలో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలో తోచక తెలుగు దేశం పార్టీ (టిడిపి) నాయకులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. మాజీ ఎంపి ఎం.వి.వి.ఎస్. మూర్తి స్థానంలో ఎం. వెంకటరావును అభ్యర్థిగా నిలబెట్టాలా లేక వెనుకబడిన తరగతుల (బిసి) నాయకుడినా అనేది వారు తేల్చుకోలేకపోతున్నారు.
మూర్తి అభ్యర్థిత్వం పట్ల పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఆసక్తి చూపడం లేదని, ఎందుకంటే, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును నేరుగా కలుసుకునే అధికారం ఉన్నందున మూర్తి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని టిడిపి వర్గాలు తెలియజేశాయి. విశాఖ పట్టణ ప్రాంతంలో గాని, గ్రామీణ ప్రాంతాలలో గాని మూర్తి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సంప్రదింపులు సాగించడం లేదని ఆయనపై మరొక ఆరోపణ ఉన్నది. అయితే, పార్లమెంట్ లో విశాఖపట్నానికి ప్రాతినిధ్యం వహించేందుకు యోగ్యుడైన అభ్యర్థి మూర్తి అని పార్టీలో ఒక వర్గం వారు వాదిస్తున్నారు. స్వయంగా పారిశ్రామికవేత్త అయినందునా, స్వతంత్ర ప్రతిపత్తి గల గీతమ్ విశ్వవిద్యాలయానికి ప్రెసిడెంట్ అయినందునా మూర్తి ఈ ప్రాంతానికి కావలసిన పెట్టుబడులు రాబట్టగలరని ఆయన మద్దతుదారులు అంటున్నారు.
ఇది ఇలా ఉండగా, విశాఖపట్నం లోక్ సభ నియోజకవర్గానికి టి. సుబ్బిరామిరెడ్డి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఖరారు చేసి అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థులను ఎంపిక చేయవలసిందని ఆయనను కోరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలుగు దేశం పార్టీ, కాంగ్రెస్ రెండూ అగ్ర వర్ణాల అభ్యర్థులను నిలబెడితే ప్రజారాజ్యం పార్టీ (పిఆర్ పి) ఈ ప్రాంతానికి చెందిన వెనుకబడిన తరగతుల నాయకుడు పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు)ను అభ్యర్థిగా నిలబెట్టగలదని విశ్లేషకులు సూచిస్తున్నారు. విశాఖపట్నం లోక్ సభ నియోజకవర్గంలో 96 శాతం మంది బిసిలు ఉన్నారు.
News Posted: 9 March, 2009
|