అది లోకేష్'క్యాష్'!
హైదరాబాద్: అధకారంలోకి వస్తే పేద కుటుంబాలకు నెలకు రెండు వేల రూపాయల నగదు పంపిణీ చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన నగదు బదిలీ పథకం(క్యాష్ ట్రాన్స్ ఫర్ స్కీం)పథకం ఆలోచన ఆయన కుమారుడు లోకేశ్ దని తెలిసింది. నిరుపేద కుటుంబాలకు రెండు వేల రూపాయలు, పేద కుటుంబాలకు 1,500 రూపాయలు, మధ్య తరగతి కుటుంబాలకు వెయ్యి రూపాయలు నెలకు ిస్తామని, పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఈ పథకాన్ని చేరుస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకాన్ని ఆర్ధికరంగ నిపుణులు అధ్యయనం చేసి చంద్రబాబుకు చెప్పినట్టు ప్రచారం జరిగింది. అయితే ఆయన కుమారుడు లోకేశ్ గత నాలుగు నెలలుగా ఈ పథకంపై దృష్టి కేంద్రీకరించి ప్రాజెక్టు సిద్ధం చేశారని, అమెరికాలో విద్యాభ్యాసం సమయంలోనే ప్రపంచ బ్యాంకులో ఒక ప్రాజెక్టును సిద్ధం చేశారని తెలిసింది. అక్కడి సమాచారం రాబట్టి నగదు బదిలీ పథకం ఏయే దేశాల్లో అమలు చేస్తున్నారన్న విషయాన్ని సంవత్సరం పాటు అధ్యయనం జరిపారు. చదువయ్యాక హైదరాబాద్ తిరిగి వచ్చి తన మిత్రులు ముగ్గురితో కలసి ఈ వినూత్న పథకాన్ని మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేశారని తెలిసింది.
ప్రాజెక్ట్ రిపోర్ట్ ను రూపొందించాక ఆర్ధిక రంగంలో నిష్ణాతులైన ముగ్గురితో లోకేశ్ నేరుగా ఈ పథకంపై చర్చించారని, వారు అందులో కొన్ని అంశాలను చేర్చి, కొన్నింటిని తొలిగించారని తెలిసింది. గతంలో శ్రీకృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయంలో ఆర్ధిక శాఖ అధిపతిగా పనిచేసి, ఆ తరువాత కాలజి సర్విస్ కమిషన్ సభ్యుడిగా కొనసాగిన వ్యక్తితో పథకం విధి విధానాలకు సంబంధించి చంద్రబాబు చర్చించారు. ప్రపంచంలోని 30 దేశాల్లో ఈ క్యాష్ ట్రాన్స్ ఫర్ స్కీం అమల్లో ఉంది. ఆయా దేశాల్లో పథకం అమలు జరుగుతున్న విధానాన్ని లోకేశ్ ఇంటర్నెట్ ద్వారా సేకరించినట్టు తెలిసింది. ఈ పథకం రూపకల్పనలో ఆయన దాదాపు మూడు నెలలు తన సమయాన్ని పూర్తిగా వెచ్చించారట. ఈ పథకం పూర్తి సమాచారం పార్టీ సీనియర్ నాయకులకు కూడా తెలియదట. దీని ముసాయిదా ప్రకటన చేసే ముందు ఢీల్లీ విశ్వ విద్యాలయనికి చెందిన సీనియర్ అధ్యాపకులకో కూడా చర్చిచాని సమాచారం.
News Posted: 10 March, 2009
|