ఇస్రోకు సైంటిస్టులు కావాలి
బెంగళూరు: దేశవాళి అంతరిక్ష ప్రాజెక్టులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడంతో యువ శాస్త్రవేత్తల కోసం ఇస్రో అన్వేషిస్తోంది. అంతరిక్ష విజ్ఞానంలో ఔత్సాహిక యువ శాస్త్రవేత్తల కోసం దేశంలోని విశ్వవిద్యాలయాల చుట్టూ ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సంస్థ తిరుగుతోంది. ఇస్రో అడ్వైజరీ కమీటీ ఫర్ స్పేస్ సైన్స్ (అడ్కోస్) రూపొందించిన స్పేస్ సైన్స ప్రొమోషన్ స్కీమ్ ద్వారా ఎనిమిది విశ్వవిద్యాలయాల్లో స్పేస్ సైన్స్ శాఖను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది.
ఈ స్కీమ్ క్రింద ఆంద్ర విశ్వవిద్యాలయం, బనారస్ విశ్వవిద్యాలయం, బెంగళూరు విశ్వవిద్యాలయం, మైసూర్ విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తేజపూర్ విశ్వవిద్యాలయాల్ని ఎంపిక చేశారు. దేశంలో అంతరిక్ష విజ్ఞానంలో పరిశోధనకు నాందిగా తొలిసారి 8 విశ్వవిద్యలయాలను మాత్రమే ఎంపిక చేసినట్లు ఆ కమిటీ తెలిపింది. విశ్వవిద్యాలయ ప్రయోజనాలు, భౌగోళిక ప్రాతినిథ్యం, ఆ విశ్వవిద్యలయంలో అందుబాటులో ఉన్న వనరులు, దాని నాయకత్వం, వాతావరణం, అంతరిక్ష విజ్ఞాన రంగంలో ఆ విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న విజ్ఞాన వారసత్వం, ఒక శక్తివంతమైన పరిశోధన కేంద్రంగా అభివృద్ది కాగల అవకాశాల్లాంటి పలు విషయాలను దృష్టిలో ఉంచుకుని ఈ విశ్వవిద్యాలయాల్ని ఎంపిక చేసినట్లు ఆ కమిటీ ప్రొగ్రాం డైరెక్టర్ జయతి దత్త తెలిపారు.
పిజి స్థాయి విద్యార్ధుల్లో అంతరిక్ష విజ్ఞానం విషయంలో ఆసక్తి రేకెత్తించేందుకు అనువుగా ఎమ్ఎస్ సి\ఎమ్ టెక్ ఫెలోషిప్ స్కీమ్ ను ప్రవేశపెడుతున్నారు. దాంతోపాటు, ఈ విశ్వవిద్యాలయాలకు లేబొరేటరీ నిర్మాణం కోసం నిధులను కేటాయిస్తున్నట్లు జయతి దత్త తెలిపారు. అంతరిక్ష విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలను నిర్వహించేందుకు అనువైన లేబోరేటరీ పరికరాలను సమకూర్చేందుకు నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఫలానా కోర్సులను నిర్వహించాలని ఇస్రో సంస్థ ఈ విశ్వ విద్యాలయాల్ని డిమాండ్ చేయదు. వాతావరణం, అంరిక్ష సైన్సుల ఫ్యాకల్టీల నిర్వహణకు అవసరమైన సదుపాయాలను మాత్రమే ఇస్రో సమకూరుస్తుంది. ఫ్యాకల్టీల నిర్వహణ ఆయా విశ్వవిద్యాలయాల బాధ్యతేనని దత్త తెలిపారు. ఈ కార్యక్రమం ఇప్పటికింకా అమలు లోకి రాలేదు. ఆ క్రమం ఇప్పుడే ప్రారంభమైంది.
News Posted: 10 March, 2009
|