న్యూఢిల్లీ : ఆనంద్ కుమార్ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేరకుండా పేదరికమే అడ్డుకున్నది. అయితే, ఈరోజు ఆయన ఒక అంతర్జాతీయ రోల్ మోడల్. 150 మందికి పైగా పేద విద్యార్థులకు ఐఐటిలలో అడ్మిషన్లను సాధ్యం చేసిన వ్యక్తి ఆయన. పాట్నాలో పేద విద్యార్థుల కోసం ఆయన ఏర్పాటు చేసిన విలక్షణ శిక్షణ (కోచింగ్) కేంద్రం 'సూపర్ 30' డిస్కవరీ చానెల్ లో ఒక గంట కార్యక్రమానికి చోటు సంపాదించింది. తాము కోచింగ్ కేంద్రంలో చేరిన రోజు నుంచి ఐఐటి-జెఇఇ పరీక్షకు హాజరైన తేదీ వరకు 2007 - 08 బ్యాచ్ విద్యార్థులు 30 మంది సాగించిన యాత్ర గురించి ఈ షో వివరిస్తుంది. విద్య ద్వారా ఇండియాలో విజయవంతమైన సాధికారత కథ గురించిన కుమార్ అవిశ్రాంత కృషిని విశదపరిచే ఈ కార్యక్రమం మార్చి 14న ప్రసారం అవుతుంది.
2008లో సూపర్ 30లో చేరిన మొత్తం 30 మంది విద్యార్థులూ వివిధ ఐఐటిలలో అడ్మిషన్లు పొందారు. ఈ కోచింగ్ సెంటర్ లో ఇప్పటి వరకు చేరిన సుమారు 200 మంది విద్యార్థులలో 152 మంది ఐఐటిలలో అడ్మిషన్లు పొందారు. 'కేంబ్రిడ్జిలో చేరలేకపోయిన రోజు నేను పేదరికం కారణంగా అర్హులైన విద్యార్థులు ఉత్తమ విద్యకు అవకాశం కోల్పోకుండా చూసేందుకు ఏదైనా చేయాలని నిశ్చయించుకున్నాను' అని ఆనంద్ కుమార్ తాను ఐపిఎస్ అధికారి అభయానంద్ సాయంతో 'సూపర్ 30' కోచింగ్ సెంటర్ స్థాపించడానికి కారణం గురించి మాట్లాడుతూ చెప్పారు. ఆయనకు ఈ విషయంలో ఆయన కుటుంబం పూర్తిగా అండగా నిలచింది. ఆయన తల్లి జయంతి దేవి విద్యార్థుల కోసం భోజనం సిద్ధం చేసేవారు. ఆయన సోదరుడు ప్రణవ్ కుమార్ హాస్టల్ ను నిర్వహించేవారు.
'కోచింగ్ కేంద్రం నిర్వహణకు నేను చెప్పే ట్యూషన్ల నుంచి వచ్చిన డబ్బుతో ఒక చిన్న నిధిని ఏర్పాటు చేశాం' అని కుమార్ తెలిపారు. ప్రవాస భారతీయులు, కార్పొరేట్ సంస్థలు ఇవ్వజూపిన విరాళాలను ఆయన నిరాకరించారు. 'సరైన శిక్షణ ఉంటే పేద పిల్లలు కూడా ఐఐటిలలో చేరగలరని నిరూపించాలనుకున్నాను అంతే' అని ఆయన చెప్పారు. కోచింగ్ కేంద్రంలోని 30 సీట్లకు పోటీ ఉధృతంగానే ఉంటుంది. సూపర్ 30కి క్రితం సంవత్సరం 3000 పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. వారిలో 500 మంది పేద విద్యార్థులను ప్రవేశ పరీక్షకు పిలిచారు. 'తెలివితేటలు, లెక్కల సామర్థ్యం విద్యార్థుల ఎంపికకు కీలకం' అని కుమార్ చెప్పారు.