కామ్రేడ్లవి సొంత నిధులే!
న్యూఢిల్లీ: రాజకీయ విరాళాల వల్ల కనిష్ఠంగా లబ్ధి పొందిన పార్టీలలో సిపిఐ, సిపిఐ (ఎం) కూడా ఉన్నాయి. ఎన్నికల కమిషన్ (ఇసి)కి అవి స్వచ్ఛందంగా సమర్పించిన అఫిడవిట్ల ద్వారా ఈ విషయం తెలుస్తున్నది.2003 - 07 కాలంలో సిపిఐకి రూ. 67.11 లక్షల మేరకు, సిపిఐ (ఎం)కు రూ. 27.70 లక్షల మేరకు విరాళాలు అందాయి. వివిధ వర్గాల నుంచి నిధులు 'సేకరించే' తమ నాయకులే తమకు భారీ దాతలని ఆ పార్టీలు తెలియజేశాయి. ఇసి వద్ద దాఖలైన అఫిడవిట్ల ప్రకారం, సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎ.బి. బర్ధన్ గరిష్ఠంగా రూ. 17.26 లక్షల మేరకు పార్టీకి విరాళం ఇచ్చారు. ఆతరువాత పార్టీ జాతీయ కార్యదర్శి డి. రాజా రూ. 10.52 లక్షలు సమకూర్చారు.
2003 - 07 నుంచి విదేశాల నుంచి విరాళాలు అందుకున్న పార్టీ బహుశా సిపిఐయే కావచ్చు. మాస్కోకు చెందిన యతీందర్ బన్సాల్ రూ. 5 లక్షల మేరకు, యునైటెడ్ కింగ్ డమ్ (యుకె)కి చెందిన సర్వన్ జాఫర్ రూ. 52,450 మేరకు విరాళాలు ఇచ్చారు. ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి నుంచి కూడా సిపిఐకి విరాళం వచ్చింది. ఆమె 2004 - 05లో రూ. 50 వేలు విరాళంగా ఇచ్చారు. కేంద్ర మహిళా, శిశు వికాస శాఖ మంత్రి రేణుక అదే సంవత్సరం సొంత పార్టీకి కూడా విరాళం ఇచ్చారు. కాని ఆ మొత్తం రూ. 29 వేలు మాత్రమే. పలు యూనియన్లు కూడా సిపిఐకి విరాళాలు అందజేశాయి. వాటిలో కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ( లక్ష రూపాయలు), అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం (రూ. 2 లక్షలు) కూడా ఉన్నాయి.
ఇక సిపిఐ (ఎం)కు విరాళాలలో చాలా వరకు హైదరాబాద్ కేంద్రంగా గల పరిశ్రమలు లేక పార్టీ సానుభూతిపరుల నుంచే వచ్చాయి. పార్టీ నాయకుడు స్వర్గీయ హరికిషన్ సింగ్ సుర్జీత్ భార్య రూ. 2 లక్షలు, ఎంపిలు బృందా కరత్, హన్నన్ మొల్లా చెరి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. ముంబైకి చెందిన మీతా మంజునాథ్ నాయక్, జిఎంఎన్ నాయక్ కలసి రూ. 2 లక్షలు విరాళం అందజేశారు. హైదరాబాద్ కు చెందిన వాణిజ్య సంస్థలు రత్నా కన్ స్ట్రక్షన్స్, ఎక్స్ఎల్ టెలికామ్ లిమిటెడ్, భాస్కర్ వైద్య కళాశాల ఒక్కొక్కటి రూ. 2 లక్షలు విరాళంగా అందజేశాయి.
News Posted: 12 March, 2009
|