వైఎస్ దే పైచేయి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నుండి లోక్ సభకు, అసెంబ్లీకి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్ధుల ఎంపికలో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తన ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించారు.ఆయన సిఫార్సు చేసిన వారికే పార్టీ టిక్కెట్లు లభించాయి. ఆయన వర్గానికి దాదాపు 80 శాం టిక్కెట్లు లభించనున్నాయని రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకుడొకరు చెప్పారు. రెండు సభల్లో సింట్టింగులు చాలా మందికి మళ్లీ పార్టీ టిక్కెట్లు లభించనున్నట్టు తెలిసింది. ఇరవై శాతం సిట్టింగులపై వేటు పడిందట! విదేశ వ్యవహారాల మంత్రి ప్రణబ్ ముఖర్జీ సారథ్యంలో హర్యానా భవన్ లో జరిగిన రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో 42 లోక్ సభ సీట్లకు, 294 అసెంబ్లీ సీట్లకు అభ్యర్ధుల పేర్లు ఖరారు చేశారు. కొన్ని స్థానాలకు మాత్రం రెండేసి పేర్లు పేర్కొని తుది నిర్ణయాన్ని సోనియా గాంధీ సారథ్యంలోని కేంద్ర స్క్రీనింగ్ కమిటీకి విడిచిపెట్టారు. అభ్యర్దుల స్క్రీనింగ్ పూర్తికావడంతో హైదరాబాద్ తిరిగి వెళ్లిన రాజశేఖరరెడ్డి మార్చి 15 లేదా 16 తేదీల్లో మళ్లీ ఢిల్లీ వచ్చి కేంద్ర కమిటీ సమావేశంలో పాల్గొంటారు.
రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్ధుల ఎంపిక వైఎస్ అభీష్టం మేరకే ఏకపక్షంగా జరుగుతోందని, రాజశేఖరరెడ్డి, ఆయన సలహాదారు కెవిపి రామచంద్రరావు హైదరాబాద్ లో తయారు చేసుకున్న జాబితా ప్రకారమే అబ్యర్ధులను ఖరారు చేస్తున్నారని ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకులు కొందరు ఫిర్యాదు చేశారు. అయితే ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులను గెలిపించే బాధ్యత వైఎస్ దే కాబట్టి ఆయన ఇష్టం ప్రకారమే అభ్యర్ధుల ఎంపిక జరుగుతోందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే తెలంగాణకు చెందిన కొందరు సీనియర్ నాయకుల అభిప్రాయాలు, ప్రతిపాదనలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నట్టు వారు చెప్పారు.
News Posted: 14 March, 2009
|