సోనియా చాలా 'పూర్'!
న్యూఢిల్లీ: వోటర్ల మనసులను (వోట్లను) గెలుచుకోవడానికి వారు గొంతు చించుకుని మాట్లాడతారు. ప్రజలను హుషారుపరుస్తూ పెద్దగా నినాదాలు చేస్తారు. కాని తమ నియోజకవర్గాల సమస్యలను పార్లమెంట్ లో ప్రస్తావించవలసి వచ్చే సరికి ఈ రాజకీయ ప్రముఖులు మందబుద్ధులులా కనిపిస్తుంటారు. అత్యున్నత స్థాయి రాజకీయ నాయకులు పార్లమెంట్ లో ప్రశ్నలు అడగడంలో విఫలమైనట్లు, ప్రభుత్వ విధానాలపై చాలా అరుదుగా చర్చలలో పాల్గొన్నట్లు పార్లమెంట్ రికార్డులు సూచిస్తున్నాయి.
ఆ రాజకీయ ప్రముఖులలో అత్యంత అధ్వాన్నంగా వ్యవహరించింది కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి. ఆమె ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. మూడు చర్చలలో మాత్రమే పాల్గొన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి పని తీరు కూడా అందుకేమీ తీసిపోలేదు. ఆయన కేవలం ఏడు చర్చలలో పాల్గొన్నారు. తన నియోజకవర్గం గురించి ఒక్క సారి కూడా ప్రస్తావించలేదు. తీవ్రమైన ఆరోగ్య సమస్యల కారణంగా వాజపేయి తన ఐదు సంవత్సరాల సభ్యత్వ కాలంలో 19 రోజులు మాత్రమే పార్లమెంట్ కు వచ్చారు.
భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి చెందిన మరొక అగ్ర నేత ఎల్.కె. అద్వానీ పని తీరు కూడా నాసిగానే ఉన్నది. ఆయన ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. 55 చర్చలలో పాల్గొన్నారు. ఇక మమతా బెనర్జీకి పార్లమెంట్ కు హాజరు కావడం కన్నా బెంగాల్ లో సిపిఐ (ఎం)తో పోరు సాగించడంతోనే సరిపోయింది. ఐదు సంవత్సరాలలో ఆమె 59 రోజులు మాత్రమే లోక్ సభకు హాజరయ్యారు. జనతా దళ్ (ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడకు కూడా రాష్ట్ర రాజకీయాలతోను, తన కుటుంబ వివాదాల పరిష్కారంతోను తీరిక లేకుండా పోయింది. అందువల్ల ఆయన పార్లమెంట్ కు 125 రోజులు మాత్రమే హాజరయ్యారు. ఆయనకు ఒక్క ప్రశ్న అడగడానికి కూడా వ్యవధి లేకపోయింది. ఆయన ఆరు చర్చలలో మాత్రమే పాల్గొన్నారు.
News Posted: 14 March, 2009
|