చిరుకు సొంతూరు కష్టమే!
రాజమండ్రి: ప్రజారాజ్యం పార్టీ (పిఆర్ పి) అధ్యక్షుడు చిరంజీవి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి శాసనసభకు పోటీ చేయాలని నిశ్చయించుకున్న పక్షంలో ఆయన గట్టి పోటీనే ఎదుర్కొనవలసి రావచ్చు. నరసాపురంలోని లక్షా 30 వేల మంది వోటర్లలో 40 శాతం వరకు కాపులు ఉన్నారు. మరొక 40 శాతం మంది వెనుకబడిన తరగతుల (బిసి) వోటర్లు ఉన్నారు. వారిలో మత్స్యకారులు కూడా ఉన్నారు. కాపులకు, మత్స్యకార కులాలకు మధ్య స్పర్థలు బలంగానే ఉన్నాయి. వీటి మధ్య శత్రుత్వం ఎంత బలంగా వేళ్ళూనుకుందంటే వేములదీవి, ఇతర సముద్ర తీర గ్రామాల ప్రజలు చిరంజీవి హీరోగా నటించిన చిత్రాలను చూడరాదని భీష్మించుకున్నారు కూడా.
ఇక నరసాపురం సెగ్మెంట్ లోని ప్రజలు చిరంజీవి పట్ల ఎంతో అసంతుష్టి చెంది ఉన్నారు. ఎందుకంటే, స్టార్ అయిన తరువాత ఆయన ఆ ప్రాంతాలను సందర్శించడానికి కూడా ఎన్నడూ ఆసక్తి కనబరచలేదు. ఆ ప్రాంతాలలో చేపట్టిన ఏ సంక్షేమ పథకానికీ ఆయన ఎన్నడూ చేయూత ఇవ్వలేదు సరి కదా కనీసం భరోసా కూడా ఇవ్వలేదు. 'మా ప్రాంతం అభివృద్ధి కోసం చిరంజీవి వీసమెత్తు కూడా కృషి చేయలేదు' అని వేములదీవి గ్రామానికి చెందిన మత్స్యకారుడు మైలా గంటయ్య ఆరోపించారు.
కొన్ని సంవత్సరాల క్రితం, మూతపడబోతున్న అందె బాపన్న జూనియర్ కాలేజీ పునరుద్ధరణకు ఆర్థిక సాయం కోసే మొగల్తూరు నుంచి కొందరు వ్యక్తులు చిరంజీవిని సంప్రదించారు. కాని వారికి ఎటువంటి సాయమూ అందలేదు. నరసాపురంలోని యెరమిల్లి నారాయణమూర్తి డిగ్రీ కాలేజీ అభివృద్ధి కోసం ఇటువంటి విజ్ఞప్తితో చిరంజీవిని కలుసుకున్నారు. అప్పుడు కూడా వారు రిక్త హస్తాలతో తిరుగుముఖం పట్టవలసి వచ్చింది. చిరంజీవి తన గ్రాడ్యుయేషన్ కోసం ఇదే కాలేజీలో చదివారు. ఈ విషయాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్ పార్టీ మత్స్యకార కులానికి చెందిన నాయకుడు డి.కె. శ్రీనివాస్ ను ఈ నియోజకవర్గంలో అభ్యర్థిగా నిలబెట్టాలని యోచిస్తున్నది.
News Posted: 15 March, 2009
|