కూటమికి నామా సీటు పోటు!
ఖమ్మం: తెలుగుదేశం నాయకుడు నామా నాగేశ్వరరావుకు ఎంపి సీటు కేటాయింపుపై మహాకూటమలో అభిప్రాయ భేదాలు తీవ్రమయ్యాయి. నామాకు ఖమ్మం సీటు ఇస్తే తాము మహాకూటమి నుంచి తప్పుకోవాలని సిపిఐ జిల్లా సమితి నిర్ణయించినట్టు తెలిసింది. అలాగే తెలుగుదేశంలో ఒక వర్గం కూడా నామా అభ్యర్ధిత్వంపై అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ఖమ్మం లోక్ సభ స్థానాన్ని సిపిఐ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావుకే కేటాయించాలని తెలుగుదేశాన్ని డిమాండ్ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఖమ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ, ఒక లోక్ సభ స్థానం ఇవ్వకపోతే సిపిఐ పేరుగా పోటి చేయడానికి సిద్ధమవుతోంది. దీనిపై అత్యవసరంగా సమావేశమై సుదీర్ఘ సమాలోచనల తరువాత నిర్ణయం తీసుకోనుంది. అయితే నామా నాగేశ్వరరావుకు ఎంపి టిక్కెట్ ఇస్తే మహాకూటమికి మొదటికే మోసం వచ్చేలా కనిపిస్తోంది.
పొత్తులపై చర్చల్లో ఖమ్మం స్థాన్ని సిపిఐకి కేటాయించడానికి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారని ప్రచారం జరిగింది. దాంతో పువ్వాడ ఈ సారి పార్లమెంటుకు పోటీ చేయడం ఖాయమని సిపిఐ నాయకులు, కార్యకర్తలు ఆనందించారు. అయితే ఖమ్మం పార్లమెంటు స్థానం తమకే అట్టేపెట్టుకోవాలని తెలుగుదేశం హఠాత్తుగా నిర్ణయించిందని, నామా నాగేశ్వరరావు పేరును ఖరారు చేసిందని ప్రచారం జరగడంతో సిపిఐ జిల్లా సమితి తీవ్రంగా స్పందించింది. నామా అభ్యర్ధిత్వానికి వ్యతిరేకంగా మహాకూటమిలో తలెత్తిన తాజా పరిణామాల ప్రభావం రాష్ట్ర రాజధానిని తాకింది. దీనిపై తెలుగుదేశం అధిష్టానం కూడా పునరాలోచనలో పడినట్టు సమాచారం.
News Posted: 16 March, 2009
|