ఎన్టీఆర్ కు బ్లాక్ క్యాట్స్ చిక్కు
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ కు రక్షణ కల్పిస్తున్న నకిలీ 'బ్లాక్ క్యాట్స్' ఆయనకు సమస్యలు పెట్టేలా ఉంది. బ్లాక్ క్యాట్ కమాండోల వలె దుస్తులు ధరించిన సుమారు 25 మంది నుంచి 30 మంది ప్రైవేట్ భద్రతా గార్డులు జూనియర్ ఎన్టీఆర్ కు రక్షణ కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఉత్తారాంధ్ర జిల్లాల్లో తెలుగు దేశం పార్టీ (టిడిపి) తరఫున రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రచారం సాగిస్తున్న విషయం తెలిసిందే. చట్ట ప్రకారం భద్రతా దళాలు ధరించే యూనిఫారాలను పోలినవి మరొకరు ధరించడం నేరం అవుతుంది. ఈ విధంగా నేషనల్ సెక్యూరిటీ గార్డుల యూనిఫారంను పోలివుండే యూనిఫారంతో ఎన్టీఆర్ భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తించడంతో రాష్ట్ర పోలీసుల దృష్టి వారిపై పడింది.
రోడ్ షో సందర్భంగా అభిమానులు ఎన్టీఆర్ ను చుట్టుమట్టి ఆయనకు శారీరకంగా హాని కలిగించకుండా నివారించేందుకు ఆయన సొంత భద్రతా సిబ్బందిని నియోగించుకున్నారు. వారు జాతీయ భద్రతా గార్డు (ఎన్ఎస్ జి) సిబ్బందిలా దుస్తులు ధరిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, నేదురుమల్లి జనార్దనరెడ్డిలకు ఎన్ఎస్ జి భద్రత కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ వాహన శ్రేణిలో ఐదు నల్లటి మహీంద్రా స్కార్పియోలు ఉంటున్నాయి. అవి టింటెడ్ గ్లాస్ లు కలిగి ఉన్నాయి. ఇది మోటారు వాహనాల చట్టం నిబంధనలకు విరుద్ధమైనది. ఆయన వాహనశ్రేణి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి వాహన శ్రేణిని పోలి ఉన్నది.
ఇటువంటి చర్యలు చట్ట విరుద్ధం. ముఖ్యంగా బ్లాక్ క్యాట్స్ ను పోలి వుండే యూనిఫారంను ధరించిన ఎన్టీఆర్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది విషయంలో పోలీసులు ఆ ప్రైవేట్ భద్రతా ఏజెన్సీపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎన్టీఆర్ పై మాత్రం నేరుగా కేసు దాఖలు కాకపోవచ్చు. కాని భద్రతా సంస్థను బాధ్యురాలిని చేసి, తన బాధ్యతల నుంచి ఉపసంహరించుకోవలసిందిగా కోరవచ్చు' అని ఇంటలిజెన్స్ భద్రతా విభాగం సీనియర్ అధికారి ఒకరు సూచించారు. ప్రైవేట్ గార్డులకు, భద్రతా సంస్థ యజమానికి ఏడాది కారాగార శిక్ష లేదా రూ. 5000 జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. తనకు అధికారికంగా భద్రత కల్పించవలసిందిగా జూనియర్ ఎన్టీఆర్ రాష్ట్ర పోలీసు శాఖను అభ్యర్థించలేదు. ఆ ప్రైవేట్ భద్రతా సంస్థ విజయవాడకు చెందినదని, వారికి ఇదే విషయమై నోటీసు పంపవచ్చునని పోలీసులు చెప్పారు.
News Posted: 16 March, 2009
|