టోకులో ఎన్నికల మద్యం
హైదరాబాద్ : వోటర్లను ఆకర్షించడానికి మద్యం పంపిణీ చేయరాదని ఎన్నికల కమిషన్ (ఇసి) ఆంక్షలు విధించినప్పటికీ సర్వే సర్వత్రా మద్యం, ఎన్నికలు చెట్టాపట్టాలు వేసుకు సాగుతున్నాయి. వోటర్లను ప్రలోభపెట్టడానికి రాజకీయ నాయకులు నియమ నిబంధనలు అన్నిటినీ తోసిరాజని మద్యం పంపిణీ చేస్తుంటారు. ఎన్నికల బడ్జెట్ లో 50 శాతం వాటా మద్యందే. అభ్యర్థులు ఈ దఫా ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ లో రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని సీనియర్ రాజకీయ నాయకుడు ఒకరు చెప్పారు.
ఈ సందర్భంగా ఆసక్తి కలిగించే విషయమేమంటే ఇంత అధిక స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతున్నా లైసెన్స్ ఉన్న డీలర్లకు లాభాలేమీ రావడం లేదు. కారణం - ఎవరో ఒక లైసెన్సు దారు పేరిట రాజకీయ నాయకులు రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ (ఎపిబిసిఎల్) పంపిణీ కేంద్రం వద్ద నేరుగా కొనుగోలు చేయడం. కొన్ని సందర్భాలలో నాయకులు విధేయులైన ఎక్సైజ్ అధికారులతో లాలూచీ పడి డీలర్లకు తెలియకుండా మద్యం కొనుగోళ్ళు జరుపుతున్నారు. దీనిపై డీలర్లు నోరు మెదపలేకపోవడం గమనార్హం. అలా చేస్తే వారు ఇటు రాజకీయ నాయకుల నుంచి, అటు ఎక్సైజ్ అధికారుల నుంచి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది.
అధికారుల తెలిసే ఎన్నికలకు ముందు ఈ కార్యక్రమం అంతా జరుగుతుంటుంది. కాని అంతా చట్టబద్ధంగా జరుగుతున్నట్లు కనిపిస్తుంది కనుక వారేమీ చేయలేరు. కాకపోతే మద్యం విక్రేతలకు ఒక విషయం ఉపశమనం కలిగిస్తున్నది. అదేమంటే ప్రతి బిల్లుపై ఎపిబిసిఎల్ ఆదాయపు పన్ను (ఐటి)ని కూడా చేరుస్తుంది కనుక ఈ అమ్మకాలపై వారు ఐటి చెల్లించవలసిన అవసరం ఉండదు. నాయకులు మద్యం సీసాల పంపిణీ బాధ్యతను తమ నమ్మిన బంట్లకకు అప్పగిస్తారు. వారు వోటర్లకు 50 శాతం మాత్రమే సీసాలను పంపిణీ చేస్తారు. మిగిలిన సరకు సగం రేటుకు మద్యం దుకాణాలకు తిరిగి చేరుతుంటుంది.
News Posted: 16 March, 2009
|