హైదరాబాద్: సీట్ల పంపకంపై మహాకూటమిలో ఏర్పడ్డ పీటముడి అలాగే కొనసాగుతున్నది. సాధ్యమైనంత త్వరగా సీట్ల సర్దుబాటు అంశాన్ని పూర్తి చేసి ప్రచార రంగంలోకి దూకుదామనుకుంటున్న కూటమి నాయకత్వం ప్రయత్నాలు అంత సులభంగా సాకారం కావటం లేదు. గురువారం కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులు విడివిడిగా టిడిపి అధినేత చంద్రబాబుతో మంతనాలు జరిపారు. ఉదయం సిపిఎం పక్షనేత రాఘవులు వచ్చి చర్చించి వెళ్ళిపోయిన అనంతరం టిఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖరరావు వచ్చి చంద్రబాబుతో సీట్ల పంపకంపై సుదీర్ఘంగా చర్చిం చారు. ఈ చర్చల సందర్భంగా కేసీఆర్ వామపక్షాల వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. తాము కోరుతున్న సీట్లనే వామపక్షాలు కావాలని పట్టుపడుతు న్నాయని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
వరంగల్ జిల్లాలో కొత్తగా ఏర్పాటైన పాలకుర్తి నియో జకవర్గాన్ని టీడీపీకి వదలిపెట్టేందుకు కేసీఆర్ ససేమిరా అన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. టీడీపీ సీనియర్ నేత ఎరబ్రెల్లి దయాకరరావు ఈసారి పాలకుర్తి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే ఆయన కెసిఆర్‌తో చర్చలు సైతం జరిపారు. నియోజకవర్గం పేరు మారినా పాలకుర్తి తమదే అని దాన్ని వదలిపెట్టే ప్రసక్తే లేదని కేసీఆర్ తెగేసి చెప్పినట్టు తెలిసింది. చంద్రబాబుతో సమావేశం జరుగుతుండగానే తెలం గాణ భవన్‌లో టిఆర్‌ఎస్ శ్రేణుల్లో రెండు వర్గాలు గందరగోళం సృష్టిస్తున్నాయని కేసీఆర్‌కు సమాచారం వచ్చింది. తాను అక్కడ ఉండటం అత్యవసరం అని చెప్పి న కేసీఆర్, చర్చల మధ్యలోనే తిరిగి వెళ్ళిపోయారు. తమకు 45 నుంచి 48 స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సుముఖత వ్యక్తం చేసిందని టిఆర్‌ఎస్ తెలిపింది. కెసిఆర్ 51 స్థానాలతో జాబితా తయారు చేసుకుని వెళ్ళారు.