లోకేశ్ అరంగేట్రం?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ భావి నాయకుడు జూనియర్ ఎన్టీఆర్ అని ఓవైపు పార్టీలో ప్రచారం జరుగుతుండగా, మరోవైపు చంద్రబాబు ఈ మధ్య తరచు తన కుమారుడి ప్రస్తావన తీసుకు వస్తున్నారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు, ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఏదైనా ఒక పథకాన్ని పార్టీవారెవరైనా సూచిస్తే, ఏ సందర్భంలోనూ వారి పేరు వెల్లడించని చంద్రబాబు మనీ ట్రాన్స్ ఫర్ స్కీమ్ ను తన కుమారుడు లోకేశ్ సూచించాడని అనేక సమావేశాల్లో పదే పదే చెబుతున్నారు. ఎన్టీఆర్ పాఠశాల, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వార్షికోత్సవాల్లో లోకేశ్ పాల్గొన్నారు. ఎన్నికల్లో పోటీకి పార్టీ టిక్కెట్లు ఆశిస్తున్న కొందరు కొత్తవారు ఆ కార్యక్రమాల్లోనే లోకేశ్ కు దరఖాస్తులు అందజేశారు.
తన ఇంట్లో వారెవరూ రాజకీయాల్లోకి రారని గతంలో చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మెల్లిగా కుమారుడిని రాజకీయాలకు పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ చరిష్మా ముందు పార్టీలో ఎవరూ నిలిచే పరిస్థితి లేదు. ఆయన ప్రతి అడుగూ వ్యూహాత్మకంగా వేస్తున్నారు. సినిమా షూటింగులో ఉన్నానని చెప్పి యువగర్జనకు కూడా హాజరు కాని జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తానొక్కరే ప్రచారం సాగిస్తున్నారు. యువగర్జనలో ఆయన పాల్గొని ఉంటే ఇప్పుడున్న క్రేజ్ ఆయనకు లభించి ఉండేది కాదని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. జూనియర్ క్రేజ్ ను న్యూట్రల్ చేసే ప్రయత్నంలో భాగంగానే లోకేశ్ రాజకీయ అరంగేట్రానికి చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
News Posted: 20 March, 2009
|