కాబూల్: తిరుగుబాటు తన బిడ్డల్ని తానే తింటుందన్నది ఫ్రెంచ్ సామెత. అలానే ఉగ్రవాదం విచణారహితమైన ఆత్మాహుతి దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఎందరో అమాయకులు బలికావడమే కాకుండా ఆత్మవినాశనం కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. అదే కోవలో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఉగ్రవాది అత్మాహుతికి దాడికి వెళుతున్న సందర్భంలో పొరపాటున బాంబు స్విచ్ పై ఒత్తిడి పగానే నడుముకు కట్టుకున్న బాంబు పేలిపోయింది. ఆత్మాహుతి సభ్యునితో పాటు ఆ బృందంలోని మరో ఆరుగురు ఆత్మాహుతి దళ సభ్యులు ఈ పేలుడులో గురువారంనాడు ఆహుతైనారు. లక్ష్యా ఛేదనకు వెళుతన్న సహ ఆత్మాహుతి దళ సభ్యునికి వీడ్కోలు చెప్పేందుకు వచ్చిన ఆరుగురు సైతం బలికావడం విషాదమే అయినా తాము ఎంచుకున్న మార్గానికి మూల్యం చెల్లించినట్లువుతుంది.
ఆఫ్ఘనిస్తాన్ లో ఆత్మాహుతి దాడులు ఒక ఏడాది నుండి పెరిగిపోసాగాయి. బ్రిటీష్ దళాలు తాలిబాన్ లతో పోరాడుతున్న దక్షిణ ఆఫ్గనిస్తాన్ హెల్మండ్ ప్రావిన్స్లో ఈ సంఘటన జరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతంలో తాలిబాన్ల తిరుగుబాటు తీవ్రతరమవుతోంది. హెల్మండ్ లో జరిగిన మరో సంఘటనలో నారి సర్రాజ్ జిల్లా పోలీస్ స్టేషన్ పై తాలిబన్లు దాడి చేసిన సందర్భంలో 9 మంది పోలీసులు మరణించారని అంతర్గత భద్రత మంత్రి తెలిపారు. అదే సమయంలో ఆఫ్గనిస్తాన్ వ్యాప్తంగా తాలిబన్ మిలిటెంట్లు ప్రభుత్వ బలగాలపై దాడులకు తెగబడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ వ్యూహంపై శనివారంనాడు అమెరికాలో సమీక్ష జరుగబోతోంది.