జూనియర్ కు చుక్కెదురు
విజయవాడ : 'ఎక్కడైనా బావే గాని....' అనే సూత్రాన్ని తెలుగు దేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కచ్చితంగా పాటిస్తారనేది మరొకసారి నిర్థారణ అయింది. రానున్న ఎన్నికల కోసం అభ్యర్థులను టిడిపి ఎంపిక చేస్తుండగా తన అనుయాయులలో ఒకరైన వల్లభనేని వంశీకి ఆయన ఆశించిన స్థానానికి టిక్కెట్ ను జూనియర్ ఎన్టీఆర్ ఇప్పించుకోలేకపోయారు. వంశీకి మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని గన్నవరం అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలని జూనియర్ ఎన్టీఆర్ గత ఆరు నెలలుగా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా ఒక దశలో ఉత్తరాంధ్ర పర్యటనను తాను అర్ధంతరంగా ముగించుకు రాగలనని కూడా జూనియర్ బెదరించారని తెలియవచ్చింది.
స్వర్గీయ పరిటాల రవికి అత్యంత సన్నిహితునిగా పేరొందిన వంశీ గడచిన ఐదు సంవత్సరాలుగా గన్నవరం స్థానంపై మక్కువ పెంచుకుంటూ సేవా కార్యక్రమాల పేరిట కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు కూడా. అయితే, ఇదే స్థానం నుంచి గతంలో పలు మార్లు పోటీ చేసిన పారిశ్రామికవేత్త దాసరి జైరమేష్ సోదరుడు బాలవర్ధనరావును పక్కన పెట్టే ధైర్యం చంద్రబాబుకు లేదనే చెప్పాలి. విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని గాని, నూజివీడు శాసనసభ స్థానాన్ని గాని కేటాయించడానికి చంద్రబాబు సిద్ధపడినా వంశీ ససేమిరా అన్నారు. పైగా అవసరమైతే గన్నవరం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయగలనని వంశీ బెదరించారు. దాసరి బాలవర్ధనరావుతో నెలకొన్న వైరంలో వంశీ ఒక సారి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు కూడా.
అయితే, ఎవరూ ఊహించని విధంగా జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురైన నేపథ్యంలో చంద్రబాబు ఇదే అదనుగా భావించి శుక్రవారం అర్ధరాత్రి సమయంలో విజయవాడ లోక్ సభ స్థానానికి వంశీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక మెట్టు దిగివచ్చి వంశీని ఒప్పించారని తెలుస్తున్నది. మరి స్థానికేతరుడైన వంశీని స్థానిక వోటర్లు, ముఖ్యంగా టిడిపి వోటర్లు ఏవిధంగా ఆదరిస్తారో వేచి చూడవలసి ఉంటుంది.
News Posted: 29 March, 2009
|