లీకు నివారణకు జామింగ్!
హైదరాబాద్ : అభ్యర్థులను 'మేనేజ్ చేయడంలో' పేరెన్నిక గన్న తెలుగు దేశం పార్టీ (టిడిపి) టిక్కెట్లు రాక నిరాశ చెందే ఆశావహులు ఇతర పార్టీలకు ఫిరాయింకుండా నిరోధించేందుకు కొత్త వ్యూహాన్నే అనుసరిస్తున్నది. ఏ సమాచారమూ ఇతరులకు ముందే అందకుండా చూడడానికి గాను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సెల్ ఫోన్ జామర్లను టిడిపి ఏర్పాటు చేసింది. టిడిపిలో తిరుగుబాటు చేసి బయటకు వచ్చిన కొంత మందికి కాంగ్రెస్ టిక్కెట్లు ఇవ్వగా, మెగాస్టార్ సారథ్యంలోని ప్రజారాజ్యం పార్టీ (పిఆర్ పి) 'వలస పక్షుల' కోసం చూస్తున్నది.
పార్టీ అభ్యర్థుల జాబితాలను రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత విడుదల చేస్తారని చంద్రబాబు నాయుడుకు పేరు ఉంది. అటువంటిది ఆయనే స్వయంగా తన రికార్డును ఈ దఫా బద్దలుకొట్టుకున్నారు. టిడిపి తన అభ్యర్థుల మూడవ జాబితాను శనివారం తెల్లవారు జామున 1.45 గంటలకు విడుదల చేసింది. ఇళ్ళలో గాఢనిద్రలో ఉన్న విలేఖరులను టిడిపి నుంచి వచ్చిన ఒక ఎస్ఎంఎస్ మేలుకొల్పింది. 'టిడిపి అభ్యర్థుల మూడవ జాబితా కోసం దయచేసి మీ ఇ-మెయిల్ ను సరి చూసుకోండి' అన్నదే ఆ ఎస్ఎంఎస్. అయితే, మొదటి జాబితాను ఈ పర్యాయం మధ్యాహ్న సమయంలో టిడిపి విడుదల చేసింది. అప్పుడు శుభముహూర్తం కావడమే ఇందుకు కారణం. చిన్నదైన రెండవ జాబితాను రాత్రి దాదాపు 8.30 గంటలకు విడుదల చేశారు.
'పార్టీ ప్రతినిధులు' మీడియాకు, ఇతర పార్టీలకు, ముఖ్యంగా ఆశావహులకు సమాచారాన్ని లీక్ చేయకుండా నివారించడానికి చంద్రబాబు నాయుడు నివాసంలో సెల్ ఫోన్ జామర్లను అమర్చడం గమనార్హం. పార్టీ వ్యవహారాలు చూస్తున్న చంద్రబాబు కుమారుడు లోకేష్ నాయుడు ఈ జామర్ల ఏర్పాటులో కీలక పాత్ర పోషించినట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. జామర్ల గురించి మీడియా ప్రశ్నించినప్పుడు చంద్రబాబు సన్నిహిత సహచరుడు ఒకరు సమాధానం ఇస్తూ, 'మా నాయకులు కొందరిపై (సమాచారాన్ని బయటకు పొక్కిస్తున్నారనే) అనుమానం మాకు ఉంది. చంద్రబాబు నాయుడు నివాసంలో ఏ సమావేశం జరిగినా కొన్ని క్షణాలలోనే ఇతర పార్టీలకు చర్చల వివరాలు అందుతున్నాయి. ఏజెంట్లను నియంత్రించడానికి మేము జామర్లను ఏర్పాటు చేశాం' అని తెలిపారు. కాగా, టిడిపి తన జాబితా విడుదలను ఆలస్యం చేస్తుండడం వల్ల ఆ ప్రభావం ఇతరులపై పడుతున్నది. పిఆర్ పి తన జాబితా విడుదలను శనివారం అదేపనిగా వాయిదా వేస్తూ పోయింది. చివరకు ఆ పార్టీ జాబితాను శనివారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత విడుదల చేసింది.
News Posted: 29 March, 2009
|