ఎన్నికలబరిలో ఐటి ఆఫీసర్లు
హైదరాబాద్ : ఐపిఎస్, ఐఎఎస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులే కాకుండా ఆదాయం పన్ను (ఐటి) శాఖ, ఐఆర్ టిఎస్ అధికారులు తమ భార్యలతో పాటు ఈ దఫా ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.
ఐటి ఉన్నతాధికారి డి. సుధాకరరావు సతీమణి పద్మ జ్యోతి కృష్ణా జిల్లా తిరువూరు శాసనసభా స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సుధాకరరావు ముంబైలో ఐటి శాఖలో అదనపు డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. తిరువూరు ఎస్ సి రిజర్వుడ్ సీటు కోసం పద్మ జ్యోతి రాష్ట్ర మంత్రి కోనేరు రంగారావు కుమార్తె తాంతియా కుమారితో పోటీ పడవలసి వచ్చింది. రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ (టిడిపి) అభ్యర్థి, మాజీ ఎంఎల్ఎ ఎన్. స్వామిదాస్ ను పద్మ జ్యోతి ఢీకొంటున్నారు.
మరొక ఐటి శాఖ మాజీ అధికారి మాల్యాద్రి బాపట్ల లోక్ సభ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్కడ ఆయనకు ప్రత్యర్థి కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి. ఆమె ఐఆర్ టిఎస్ మాజీ అధికారి పనబాక కృష్ణయ్య భార్య. కాగా, కృష్ణయ్య స్వయంగా కాంగ్రెస్ అభ్యర్థిగా నెల్లూరు జిల్లా గూడూరు శాసనసభా స్థానానికి పోటీ చేస్తున్నారు.
ఐపిఎస్ అధికారి డి.టి. నాయక్ మహబూబాబాద్ లోక్ సభ స్థానానికి ప్రజారాజ్యం పార్టీ (పిఆర్ పి) అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల బరిలో నిలచిన ఇతర ఐపిఎస్ అధికారులలో రెడ్డప్ప రెడ్డి, కె. విజయరామారావు ఉన్నారు. రెడ్డప్ప రెడ్డి కాంగ్రెస్ తరఫున, విజయరామారావు టిడిపి తరఫున పోటీ చేస్తున్నారు.
News Posted: 30 March, 2009
|