బిజెపి కదనకుతూహలం
హైదరాబాద్: 'వంద రోజుల్లో తెలంగాణ, ప్రస్తుత ప్రభుత్వ అవినీతి, మత రిజర్వేషన్లు, తీవ్రవాదం-ఉగ్రవాదం, పెరిగిన ధరలు' ఈ ఐదు నినాదాలు ఆయుధాలుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తొలి విడత ఎన్నికలు జరిగే దాదాపు అన్ని స్థానాలకూ బిజెపి పోటీ చేస్తోంది. ఈ ఐదు నినాదాలతో పాటు బిజెపి అజెండా - సమర్ధ నేత, సమర్ధ రీతి, సమర్ధ పాలన పేరిట ప్రచార సామగ్రిని కూడా తయారు చేస్తున్నారు. వంద రోజుల్లో తెలంగాణ నినాదాన్ని ప్రజలు నమ్మే విధంగా నచ్చచెప్పడం ద్వారా విజయం సాధించాలని బిజెపి వ్యూహం రూపొందించుకుంది. గతంలో ఎన్నిసార్లు తెలంగాణ గురించి మాట్లాడినా, ఒకే ఓటు రెండు రాష్ట్రాల అస్త్రాన్ని ప్రయోగించినా విఫలమైన ఆ పార్టీ, తొలిసారిగా ఈ అంశాన్ని జాతీయ అజెండాలో చేర్చడంతో పాటు కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చితీరుతుందని, దీన్ని ఎవరూ అడ్డుకోలేరని చెబుతోంది.
అందుకు తగ్గట్టుగానే ఎన్నికల మిషన్ ను ఏర్పాటుచేసి వ్యూహాత్మక ప్రచారానికి సిద్ధమవుతోంది. భారీ బహిరంగ సభలు నిర్వహించి, కీలకమైన జాతీయ నాయకులచేత ఉపన్యాసాలు ఇప్పించే బదులు స్థానికి అంశాలనే ప్రచారాస్త్రాలుగా చేసుకుని చిన్నచిన్న సమావేశాలు నిర్వహించి ప్రజల్లోకి వెళ్లాలని బిజెపి భావిస్తోంది. ఈ మేరకు తెలంగాణ ప్రాంత అభ్యర్ధులతో భారీ సమావేశాన్ని నిర్వహించి ప్రచార వ్యూహంలో వారికి శిక్షణ ఇచ్చింది. గతంలో ద్విముఖ పోటీలో కాంగ్రెస్ తో నేరుగా పోటీ చేసిన బిజెపి ఇప్పుడు తొలిసారిగా పంచముఖ పోటీని ఎదుర్కుంటోంది. కాంగ్రెస్, తెలుగుదేశం మహాకూటమి, ప్రజారాజ్యం, లోక్ సత్తా అభ్యర్ధులతో సమానంగా ఈసారి బిజెపి ఎన్నికల బరిలోకి దిగడంతో, ఏ చిన్న తేడా వచ్చినా విజయావకాశాలు చేజిక్కించుకోవచ్చని ఆశిస్తోంది.
News Posted: 1 April, 2009
|