ఈసారి ఆంధ్ర మొండి'చేయి'?
హైదరాబాద్: ఆలిండియా కాంగ్రెస్ కమిటీ(ఎఐసిసి) ఈ సారి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ పై పెట్టుకున్న ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. క్రితం సారి ఎన్నికల్లాగే ఈ సారి కూడా రాష్ట్రం నుంచి కాంగ్రెస్ ఎంపిలు అధిక సంఖ్యలో ఎన్నికవుతారని ఎఐసిసి ఆశిస్తోంది. కాని పరిస్థితులు అందుకు ఏమాత్రం అనుకూలంగా కనిపించడం లేదు. తమతమ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ అభ్యర్ధుల గెలుపు బాధ్యతలను సంబంధిత ఎంపి అభ్యర్ధులకే కాంగ్రెస్ పార్టీ అప్పగిస్తూ, అభ్యర్ఘులను ఎంపిక చేసే అవకాశాన్ని కూడా వారికే ఇచ్చింది. అయితే ఆశావహుల సంఖ్య అధికంగా ఉండడంతో, టిక్కెట్లు దక్కనివారంతా ఎంపి అభ్యర్ధులపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా త్రిముఖ పోటీ నెలకొనగా, మూడు ప్రధాన పార్టీల నుంచి బలమైన అభ్యర్ధులే పోటీలో ఉన్నారు. గత ఎన్నికల వరకూ ద్విముఖ పోటీలు జరగడంతో కొన్ని సందర్భాల్లో లక్షల ఓట్ల మెజారిటీతో అభ్యర్ధులు విజయం సాధించారు. కాని ఈసారి మాత్రం ఎవరు గెలిచినా ఐదు నుంచి పది వేల లోపు మెజారిటీతో గెలిచే అవకాశాలు మాత్రమే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 15 నుంచి 20 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ ఎంపిలు మాత్రమే గెలిచే సత్తా ఉన్నవారుగా కనిపిస్తున్నారు. గత ఐదు సంవత్సరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు, అమలు చేసిన పథకాలేవీ వీరి విజయానికి దోహదపడలేక పోతున్నాయి. వీరి కంటె అసెంబ్లీ టిక్కెట్లు లభించని ఆశావహులు, త్రిముఖ పోటీ అభ్యర్ధుల వ్యక్తిగత సామర్ధ్యాలే వారి విజయావకాశాలను ప్రభావితం చేయనున్నాయి.
News Posted: 2 April, 2009
|