ఇవిఎంలో పట్టని అభ్యర్థులు
హైదరాబాద్ : రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలలో ఇండిపెండెంట్, తిరుగుబాటు అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండడం ఎన్నికల కమిషన్ (ఇసి)కి సమస్యలు సృష్టిస్తున్నది. ఎందుకంటే, ఒక్కొక్క ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (ఇవిఎం)లో 16 పేర్లు మాత్రమే పట్టగలవు. గురువారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 17 అసెంబ్లీ సెగ్మెంట్లు, నాలుగు లోక్ సభ నియోజకవర్గాలలో 16 మంది కన్నా ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. వేలాది పోలింగ్ కేంద్రాలు ఉన్న ఈ నియోజకవర్గాలు అన్నిటిలో అభ్యర్థుల పేర్లు అన్నీ పొందుపరచడానికి అదనపు ఇవిఎంలను సమకూర్చవలసి ఉంటుంది.
రాష్ట్రంలో 60 వేల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. లక్షా 20 వేల ఇవిఎంల సరఫరా కోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 16న మొదటి దశ ఎన్నికలలో వాడకం కోసం వాటిని ఉద్దేశించారు. 22 లోక్ సభ నియోజకవర్గాలు, 154 శాసనసభ నియోజకవర్గాలలో 16న పోలింగ్ జరగనున్నది.
ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే ముషీరాబాద్, నాంపల్లి, గోషామహల్, సికింద్రాబాద్ వంటి అసెంబ్లీ సెగ్మెంట్లలో 16 మంది కన్నా ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటరీ స్థానాలు ఒక్కొక్కదానిలో ఆ సంఖ్య 23 దాటింది. 'హైదరాబాద్ జిల్లా కోసం ఇవ్పటికే సరఫరా చేసిన 7200 ఇవిఎంలకు అదనంగా 4000 ఇవిఎంలు అవసరమవుతాయని మేము ఎన్నికల అధికారులకు తెలియజేశాం' అని జిల్లా ఎన్నికల అధికారి ఎం.టి. కృష్ణబాబు చెప్పారు.
కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బిజెపి), బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్ పి), ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ), తెలుగుదేశం పార్టీ (టిడిపి), తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్), మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) వంటి ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్, అజేయ భారత్ పార్టీ, లోక్ సత్తా పార్టీ, ముస్లిం లీగ్, ప్రజా భారత్ పార్టీ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, సమతా పార్టీ, యునైటెడ్ విమెన్ ఫ్రంట్, త్రిలింగ ప్రజా ప్రగతి పార్టీ అభ్యర్థులు, అనేక మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు.
News Posted: 3 April, 2009
|