మిత్రునికి 'మెగా హ్యాండ్'!
భీమవరం : స్వయంగా చిరంజీవి మిత్రుడతను. చిన్నప్పటి నుంచీ కలిసి మెలిసి తిరిగారు. ఒకే చోట చదువుకున్నారు. తమ తమ వృత్తులు, వ్యాపకాలు వేరైనా, వేర్వేరు చోట్లలో ఉంటున్నా ఏనాడూ వారిలో దూరంగా ఉన్న భావన కలగలేదు. జిల్లా రాజకీయాల్లో మరీ ముఖ్యంగా భీమవరం రాజకీయాల్లో ఆయనో పిన్ పాయింట్ అవుతారన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి. నటుడిగా తన యాత్రకు విరామం పెట్టి రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తిన చిరంజీవి స్థాపించిన పార్టీలో ఆయన కూడా ఓ ప్రముఖ స్థానంలో ఉంటారనుకున్నారు. ఆయనకే భీమవరం అసెంబ్లీ స్థానంలో పోటీ చేసేందుకు టిక్కెట్ కూడా దక్కుతుందనుకున్నారు. చివరికి చిరంజీవి చిన్ననాటి మిత్రునికి మెగా హ్యాండే ఇచ్చారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసేందుకు మిత్రునికి తాను టిక్కెట్ ఇవ్వడం లేదని ప్రకటించారు. ఇంతకీ ఎవరా చిరంజీవి చిరకాల, చిన్ననాటి మిత్రుడు? ఆయనే డాక్టర్ కత్తుల సత్యప్రసాద్. భీమవరంలో సత్యప్రసాద్ వైద్య వృత్తిలో ఉన్నారు. సినిమాల్లో ప్రముఖ కెమెరామన్ కె.దత్తుకు ఈయన స్వయంగా సోదరుడు.
'నా మిత్రుడు సత్యప్రసాద్ సేవ చేయడానికే వచ్చాడు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఇవ్వను. అధికారంలోకి వచ్చిన తరువాత గౌరవప్రదమైన స్థానం కల్పిస్తా' అంటూ చిరంజీవే స్వయంగా ప్రకటించడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. జిల్లా నుంచి తొలి టిక్కెట్ సత్యప్రసాద్ కే ప్రకటిస్తారని ప్రగాఢ విశ్వాసంతో పార్టీ క్యాడర్ ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ కన్వీనర్ గా సత్యప్రసాద్ ను నియమించినప్పుడే ఆయనకు భీమవరం అసెంబ్లీ టిక్కెట్ ఖరారైపోయిందన్నంత హడావుడి పట్టణంలో జరిగింది. ఇప్పుడేమో సత్యప్రసాద్, ఆయన అనుచరుల ఉత్సాహంపైన చిరంజీవి చల్లగా నీళ్ళు చల్లిపోయారు. నామినేషన్లకు తుది గడువు మరి ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉందనగా చిరంజీవి సత్యప్రసాద్ అభ్యర్థిత్వంపై X మార్క్ పెట్టేశారు. దీనితో ముందు వరుసలో ఉంటాడనుకున్న సత్యప్రసాద్ పరిస్థితి ఇప్పుడు తెరవెనుక వేల్పులా మారాల్సి వచ్చిందని స్థానికంగా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నిన్నటి దాకా టిక్కెట్ వార్తల్లో ఉన్న సత్యప్రసాద్ ఇప్పుడు టిక్కెట్ రాని ప్రముఖ వ్యక్తిగా కూడా వార్తల్లోనే ఉండడం గమనార్హం.
News Posted: 4 April, 2009
|