ఎన్నారైలకూ బాబు...పోటు!
హైదరాబాద్: నిధులకోసం తమ చుట్టూ ప్రదక్షిణలు చేసిన పార్టీలు టిక్కెట్లు ఇచ్చే విషయంలో మొండిచెయ్యి చూపడంతో, రాజకీయాల్లో ప్రవేశించిన ప్రవాస తెలుగు భారతీయులు పూర్తిగా అసంతృప్తికి గురయ్యారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పార్టీకోసం, ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం నిధులు సేకరించడానికి అమెరికా తదితర దేశాలకు వెళ్లినప్పుడు, ఎన్నికల్లో టిక్కెట్లు ఆశించిన ఎన్నారైలు అనేకమంది ఎన్నో విందు సమావేశాలు ఏర్పాటు చేసి నిధులు సమకూర్చారు. ఆ తరువాత వారు రాష్ట్రానికి తిరిగి వచ్చి, తెలుగుదేశం టిక్కెట్లు రాకపోతాయా అన్న ధీమాతో పార్టీకోసం పనిచేయడం ప్రారంభించారు. ఈ విధంగా దాదాపు 40 మంది ఎన్నారైలు తెలుగుదేశం టిక్కెట్ల కోసం పోటీ పడగా, వారిలో ఇద్దరు మాత్రం దక్కించుకో గలిగారు. కడప లోక్ సభ స్థానానికి పాలెం శ్రీకాంత్ రెడ్డికి, దక్శి(ప్రకాశం జిల్లా) అసెంబ్లీ స్థానానికి ఎం.వెంకటరమణకు టిక్కెట్లు లభించాయి.
టిక్కెట్లు లభించని ప్రముఖులైన ప్రవాస భారతీయులలో కోమటి జయరాం ఒకరు. ఈయన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) అధ్యక్షుడైన మాజీ ఎమ్మెల్యే కోమటి భాస్కరరావు కుమారుడు. జయరాం విజయవాడ లోక్ సభ స్థానానికి టిక్కెట్ ఆశించగా, ఆయన సోదరుడు సుధాకరరావు మైలవరం(కృష్ణా జిల్లా)అసెంబ్లీ స్థానాన్ని కోరుకున్నారు. అయితే పార్టీ అధిష్టానవర్గం నందిగామ సిట్టింగ్ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావుకు మైలవరం టిక్కెట్ ఇచ్చింది. అలాగే విజయవాడ లోక్ సభ స్థానాన్ని ఆశించిన నవనీతకృష్ణ, కేశినేని కిశోర్(డల్లాస్), విజయవాడ తూర్పు అసెంబ్లీ స్థానాన్ని ఆశించిన దాసరి సతీష్(న్యూజెర్సీ), కడప జిల్లా రాజంపేట స్థానాన్ని ఆశించిన వేమన సతీష్ లకు నిరాశే మిగిలింది.
News Posted: 5 April, 2009
|