తళుకు తగ్గిన ప్రచారాలు
హైదరాబాద్: రాజకీయ పార్టీల తరఫున ప్రచారం చాయడానికి మొదట్లో ఉత్సాహంగా ముందుకు వచ్చిన 'స్టార్'లు క్రమంగా చల్లబడిపోతున్నారు. ఒకరిద్దరు మినహా సినీ తారలతో సహా మిగతా ప్రముఖులంతా ప్రచార పర్యటనలను విరమించుకున్నారు. కొందరికి ఆయా పార్టీలు టిక్కెట్లు ఇవ్వకపోవడం, మరి కొందరు ఏదో ఒకటి జరగకపోతుందా అని ఇంకా ఎదురు చూస్తుండడం అందుకు కారణాలు. కాంగ్రెస్ పార్టీ తమ తరఫున ప్రచారంలో పాల్గొనే సినీ తారలతో సహా 39 మంది ప్రముఖ నాయకుల పేర్లను ఎన్నికల కమిషన్ కు సమర్పించింది. వారిలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తో సహా రాష్ట్ర నాయకులు ఉన్నారు. సినీ ప్రముఖులు మోహన్ బాబు, దాసరి నారాయణరావు, మాజీ ముఖ్యమంత్రులు ఎన్.జనార్దనరెడ్డి, ఎన్.భాస్కరరావు తదితరులు రాష్ట్రవ్యాప్త పర్యనలను తప్పించుకుంటున్నారు. నటి జయసుధ, కేంద్ర మంత్రులు ఎస్.జైపాల్ రెడ్డి, రేణుకా చౌదరి తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు.
ప్రజా ప్రాతిధ్య చట్టం సెక్షన్ 77 ప్రకారం ప్రతి పార్టీ తమ తరఫున ప్రచారం చేసే ప్రముఖుల జాబితాను కమిషన్ కు సమర్పించాలి. వారికయ్యే ఖర్చులను సంబంధిత అభ్యర్ధుల ఖాతానుండి మినహాయిస్తారు. తెలుగుదేశం పార్టీ 25 మంది నాయకులు, నటులను తన జాబితాలో పేర్కొంది. అయితే వారిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, సినీ నటులు బాలకృష్ణ, కల్యాణ్ రామ్, తారకరత్న, కవిత మాత్రమే రాష్ట్రంలో పర్యటిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారు. కె.ెర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, నాగం జనార్దనరెడ్డి, కోడెల శివప్రసాదరావు, రోజా ప్రచారంలో ప్రధానంగా కనిపించడం లేదు. ఇక ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. చిరంజీవి, పవన్ కల్యాణ్ మాత్రమే మొత్తం ప్రచార భారాన్ని మోస్తున్నారు.
News Posted: 5 April, 2009
|