'స్టార్లూ! రోడ్లెక్కకండి'
హైదరాబాద్ : నటులు మరీ ఎక్కువగా రాజకీయ పార్టీల రోడ్ షోలలో పాల్గొనడం వల్ల వారు తమ గురించి జనంలో ఉండే ఒక విధమైన ఆసక్తిని కోల్పోగలరని తెలుగు చలనచిత్ర పరిశ్రమ (టాలీవుడ్) నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. రోడ్ షోలలో పాల్గొంటున్న నటులు గ్రామాలలో కొద్దిపాటి జనాన్ని ఉద్దేశించి కూడా ప్రసంగిస్తున్నారని, ఈ 'ఎక్స్ పోజర్' మరీ అతికావడం వారి పేరు ప్రఖ్యాతులకే హాని కలిగిస్తున్నదని నిర్మాతలు ఫిర్యాదు చేస్తున్నారు. 'ఉదాహరణకు, నటుడు డాక్టర్ రాజశేఖర్ పెక్కు టివి షోలలోను, ఇంటర్వ్యూలలోను పాల్గొన్నారు. ఆయన తాజా చిత్రం అంతగా ఆడకపోవడానికి ఇదే కారణమని మా భావన' అని ఆంధ్ర ప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి (ఎపిఎఫ్ సిసి) కార్యదర్శి విజయేందర్ రెడ్డి చెప్పారు. 'స్టార్లను ఎప్పుడు పడితే అప్పుడు జనం చూస్తుంటే వారు తమ ఆకర్షణ శక్తిని కోల్పోవచ్చు' అని విజయేందర్ రెడ్డి అభిప్రాయం వెలిబుచ్చారు.
జవంలో ఆసక్తిని పదిలపరచుకోవడానికి, బాక్సాఫీస్ వసూళ్ళను మెరుగుపరచుకోవడానికి నటులు తమను తాము టివిలో రాజకీయ పార్టీల తరఫున ప్రచారానికే పరిమితం చేసుకోవాలని రాష్ట్ర చలనచిత్ర నిర్మాతల మండలి (ఎపిఎఫ్ పిసి) సూచించింది.
నటులు రోడ్ షోలలో పాల్గొంటుడడం వల్ల చాలా మంది నిర్మాతలు తమ చిత్రాల షూటింగ్ కార్యక్రమాలను వాయిదా వేసుకోవలసి వచ్చింది. అంతేకాకుండా నటులు కొన్నిసార్లు రోడ్ షోలలో ప్రమాదాలకు గురవుతుంటారు. ఇది పరిశ్రమను నష్టం కలిగిస్తుంటుంది.
'నటి సౌందర్య గత సార్వత్రిక ఎన్నికలలో ప్రచారం సమయంలో హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందింది' అని చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు. 'కొన్ని సంవత్సరాల క్రితం నటుడు కృష్ణ ఒక ప్రమాదంలో గాయపడ్డారు. ఈ దఫా జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదంలో చిక్కుకున్నారు' అని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రచారం కారణంగా షూటింగ్ లు నిలచిపోవడంతో నిర్మాతలు భారీగా నష్టపోతున్నారని భరద్వాజ చెప్పారు.
నటులు ఏదో ఒక రాజకీయ పార్టీతో మమేకం కావడం మంచిది కాదని, ఇది వారి అభిమానులపై ప్రభావం చూపుతుందని కూడా నిర్మాతలు భావిస్తున్నారు. 'బాలకృష్ణ తెలుగు దేశం పార్టీకి మద్దతు ఇస్తుండడంతోను, చిరంజీవి సొంతంగా పార్టీని స్థాపించడంతోను ప్రజారాజ్యం మద్దతుదారులు ఇప్పుడు బాలకృష్ణ చిత్రాలను చూడకపోవచ్చు' అని భరద్వాజ అన్నారు. 'యువ నటులకు కూడా ఇదే వర్తిస్తుంది. మేము ఇక్కడ ఉన్నది జనానికి వినోదం కలిగించడానికే. మమ్మల్ని మేము దానికే పరిమితం చేసుకోవాలి' అని భరద్వాజ అన్నారు.
News Posted: 7 April, 2009
|