వైఎస్ ఒంటరి పోరు!
హైదరాబాద్: రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అయినా ఆయన వెంట ఎవరూ తోడు లేరు. ఆకర్షణీయమైన హామీలు అసలే లేవు! ఒంటరిగానే పోరాటం, ప్రచారం ఒంటరిగానే. ఇదీ రాజశేఖరరెడ్డి ప్రచారం తీరు!
ఇంకొకరి వెంట మందీ మార్బలం మిత్రప పక్షా నాయకులే! కలర్ టివిలు, నగదు బహుమతులు స్పెషల్ ఆఫర్ లు. నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మహాకూటమిలోని మూడు పార్టీల మద్దతు. ఇది తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రచార ధోరణి.
మరొకరు అభిమాన సినీ నటుడిగా లక్షలాది అభిమానుల హృదయాల్లో పీఠం వేసుకున్నారు. తమ్ముడు పవన్ కల్యాణ్ ప్రచారం అదనపు అట్రాక్షన్! సామాజిక న్యాయం నినాదం మరో తోడు. ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ప్రచారం సీను ఇదీ!
ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి ఆకర్షణీయమైన హామీలు, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ కు బలాన్నిచ్చాయి. కాని ఈసారి ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ కొత్తగా ఎటువంటి హామీలు ఇవ్వలేదు. గత ఐదు సంవత్సరాలలో అమలు చేసిన పథకాలనే చెప్పడం తప్ప మళ్లీ అధికారంలోకి వస్తే కొత్తగా ఎటువంటి హామీలు ఇవ్వడం లేదు. అమలుకు సాధ్యంకాని హామీలు ఇవ్వం, ఇచ్చిన హామీలను మరువం అన్నది వైఎస్ నినాదం. కేవలం విశ్వసనీయతపైనే ఆధారపడి కొత్తగా ెటువంటి హామీలు ఇవ్వకుండా ముక్యమంత్రి వైఎస్ మొండిగా ప్రచార రంగంలోకి దిగారు.@Multiగత ఐదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, అంతకుముందు తొమ్మిదేళ్ల తెలుగుదేశం ప్రభుత్వం పని తీరును బేరీజు వేసుకుని, ఇచ్చిన హామీలని అమలు చేసింది ెవరు? అమలు చేయనిది ఎవరు? అన్నది ఆలోచించుకుని ఓటు వేయాలని ప్రజలను వైఎస్ కోరుతున్నారు. గత ఎన్నికల్లోను, ప్రస్తుత ఎన్నికల్లోను వైఎస్ ది ఒంటరి ప్రచారమే. ఈసారి కేవలం విశ్వసనీయత(క్రెడిబిలిటీ) మీదనే ప్రధానంగా ఆధారపడ్డారు. కాకపోతేగత ఎన్నికల సమయంలో అప్పటి ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తమ ప్రభుత్వం పట్ల లేకపోవడం వైఎస్ కు అనుకూలం. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరిస్థితి వేరు. ఆకర్షణీయమైన పథకాలతో ఓటర్లకు గాలం వేశారు. ప్రచారంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల తోడు, మిత్ర పక్షాల నీడ పుష్కలంగా ఉన్నాయి. క్రితంసారిలా ప్రజల వ్యతిరేకత లేదు. ప్రభుత్వ, కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లలో ప్రజారాజ్యం పార్టీ తీలిక తీసుకురావడం, తెలుగుదేశం హామీల పట్ల ప్రజల్లో విశ్వసనీయత లేకపోవడం చంద్రబాబుకు వ్యతిరేకం కానున్నాయి.
ప్రజారాజ్యం పార్టీ విషయానికి వస్తే సినీ నటుడిగా చిరంజీవికిగల ఆకర్షణ పెద్ద బలం. పవన్ కల్యాణ్ కు కూడా యువతలో గల ఆకర్షణ అదనపుబలం. సామాజికన్యాయం కూడా కలిసివచ్చే అంశం. కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల పనితీరును చూసిన ప్రజలను మార్పు కోసం ఒక్క అవకాశం ఇవ్వాలని చిరంజీవి అడుగుతున్నారు. కాకపోతే అంతర్గతంగా పార్టీలో తలెత్తిన అసమ్మతి, పార్టీ నాయకులు ఒక్కొక్కరు దూరం కావడం ప్రతికూలాంశాలు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎవరిని ఆదరిస్తారోనని ఆందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
News Posted: 7 April, 2009
|